క్రిస్మస్ విన్నర్ ఎవరు?

గత ఏడాది చివరి వీకెండ్లో చాలా సినిమాలే రిలీజయ్యాయి. ఒకేసారి అరడజను చిత్రాలు థియేటర్లలోకి దిగాయి. వాటిలో మోహన్ లాల్ డబ్బింగ్ మూవీ ‘వృషభ’ ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయిపోయింది. మిగతా అయిదు తెలుగు చిత్రాల్లో క్రిస్మస్ విన్నర్ ఏదవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి సమాధానం రావడానికి కొన్ని రోజుల సమయం పట్టింది.

‘దండోరా’ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా దానికి వసూళ్లు రాలేదు. ‘పతంగ్’ కూడా టాక్ బాగుంది కానీ.. సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల ఆ సినిమా ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది. ‘ఛాంపియన్’ సినిమాకు రిలీజ్ ముంగిట హైప్ ఉన్నప్పటికీ.. అది మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులకే నచ్చడంతో ఆ చిత్రం ఆశించిన వసూళ్లు సాధించలేకపోయింది. ఇక ‘ఈషా’ మూవీ నెగెటివ్ టాక్‌తోనూ మంచి ఓపెనింగ్స్ సాధించింది కానీ.. వీకెండ్ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అయిపోయాయి.

కానీ ఆది సాయికుమార్ మూవీ ‘శంబాల’ ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుని.. ఆ టాక్‌ను మించిన వసూళ్లతో దూసుకెళ్లింది. వీకెండ్లో మంచి వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా సినిమా బలంగా నిలబడింది. వీక్ డేస్‌లో మిగతా చిత్రాలన్నీ వీక్ అయిపోగా.. ‘శంబాల’కు మాత్రం కలెక్షన్లు ఎక్కువ డ్రాప్ కాలేదు. రెండో వీకెండ్లో ఈ సినిమా అన్ని సినిమాలనూ పక్కకు నెట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.

గురువారం జనవరి ఫస్ట్ సెలవును ఈ చిత్రం బాగా ఉపయోగించుకుంది. ఈ సినిమాకు బుక్ మై షోలో తెగిన టికెట్ల సంఖ్య.. మిగతా చిత్రాలన్నింటికీ కలిపి అమ్ముడైన టికెట్లకు సమానంగా ఉండడం విశేషం. శుక్ర, శని, ఆదివారాల్లో ఈ సినిమా మరింత మెరుగైన వసూళ్లు సాధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం రూ.15 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆల్రెడీ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిన మూవీ.. బయ్యర్లకు మంచి లాభాలు అందిస్తోంది. క్రిస్మస్‌కు ‘శంబాల’నే క్లియర్ విన్నర్ అనడంలో సందేహం లేదు.