సీనియ‌ర్ న‌టికి స‌జ్జ‌నార్ ప‌రామ‌ర్శ‌

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న పోలీస్ అధికారుల్లో స‌జ్జ‌నార్ ఒక‌రు. యువ‌త ఆయ‌న‌కు బాగా క‌నెక్ట్ అవుతారు. ఓవైపు త‌న బాధ్య‌తల విష‌యంలో చాలా క‌చ్చితంగా ఉంటూనే.. స‌మాజానికి మంచి చేసే ఈవెంట్ల‌లో పాల్గొంటూ, సేవా కార్య‌క్ర‌మాల్లోనూ త‌న వంతు పాత్ర పోషిస్తూ త‌న ప్ర‌త్యేత‌ను చాటుకుంటూ ఉంటారు స‌జ్జ‌నార్.

హైద‌రాబాద్‌లో డిసెంబ‌రు 31న వేడుక‌ల సంద‌ర్భంగా ఎలాంటి అప‌శ్రుతులు చోటు చేసుకోకుండా ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రించి ప్ర‌శంస‌లు అందుకున్న స‌జ్జ‌నార్.. త‌ర్వాతి రోజు ఓ మంచి ప‌నితో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఒక వృద్ధాశ్ర‌మంలో జ‌రుపుకోవ‌డం విశేషం.

వృద్ధుల‌ను క‌లిసి వారి యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. అక్క‌డ అనారోగ్యంతో బాధ ప‌డుతున్న సీనియ‌ర్ న‌టి పావ‌లా శ్యామ‌ల‌ను ఆయ‌న క‌లిశారు. దీని గురించి ఎక్స్‌లో ఒక పోస్టు కూడా పెట్టారు స‌జ్జ‌నార్.

”నూత‌న సంవ‌త్స‌ర వేడుకలంటే కేవ‌లం సంబ‌రాలు, హంగులే కాదు. ఆత్మీయ‌త‌ను పంచుకోవ‌డం, బాధ్య‌త‌ను గుర్తు చేసుకోవ‌డం. ఇదే సంక‌ల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబ‌రంగా, సేవా దృక్ప‌థంతో ప్రారంభించాను. స‌హ‌చ‌ర పోలీసు అధికారుల‌తో క‌లిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేష‌న్ వృద్శాశ్ర‌మాన్ని సంద‌ర్శించ‌డం, అక్క‌డి 48 మంది పెద్ద‌ల యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకోవ‌డం ఆనందాన్ని క‌లిగించింది. అనారోగ్యంతో బాధ ప‌డుతున్న పావ‌లా శ్యామ‌ల గారిని ప‌రామ‌ర్శించాను. క‌ష్ట‌కాలంలో ఉన్న ఆమెను ఆదుకుని, ఈ హెల్త్ కేర్ సెంట‌ర్లో చేర్పించిన తిరుమ‌ల‌గిరి ఏసీపీ ర‌మేష్ చొర‌వ అభినంద‌నీయం” అని స‌జ్జ‌నార్ పేర్కొన్నారు.

త‌ల్లిదండ్రుల‌ను నిర్ల‌క్ష్యం చేసే, వృద్ధాశ్ర‌మాల‌కు ప‌రిమితం చేసే వారికి స‌జ్జ‌నార్ ఇంత‌కుముందే వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా వృద్ధాశ్ర‌మాన్ని సంద‌ర్శించ‌డం ద్వారా ఆయ‌న ఒక మెసేజ్ ఇవ్వాల‌నుకున్నారు. వృద్ధాశ్ర‌మాలు లేని స‌మాజం రావాల‌ని, త‌ల్లిదండ్రుల‌కు ఎంత చేసినా వారి రుణం తీర‌ద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్యాఖ్యానించారు.