వెంకటేష్ ఉంటే ఇంకా బాగా నచ్చేదేమో

న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు అభిమానులు భారీ నెంబర్లు ఆశించారు. మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకు ఎలాగైతే ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తారో దీనికి అలాగే వస్తారని భావించారు. కానీ కొన్ని మెయిన్ సెంటర్లు మినహాయించి మిగిలిన చోట రెస్పాన్స్ సోసోగా ఉంది.

దర్శకుడు విజయ్ భాస్కర్ లేకుండా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత స్రవంతి రవికిశోర్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేసిన ప్రమోషన్లు అంతగా పని చేసినట్టు లేవు. సోషల్ మీడియాలో సౌండ్ బాగానే చేశారు కానీ భారీ కలెక్షన్లుగా మారలేకపోయాయి. కొంత లోతుగా విశ్లేషిస్తే ఒక ఆసక్తికరమైన కోణం కనిపిస్తుంది.

నువ్వు నాకు నచ్చావ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కారణం బయటికి చెప్పలేదు కానీ వచ్చే వారం తిరిగి రాబోతున్నారు. ఆయన డేట్ ని బట్టే మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేయమని చిరంజీవి ప్రత్యేకంగా సూచించారట.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నువ్వు నాకు నచ్చావ్ కు సంబంధించి సోషల్ మీడియాలో వెంకటేష్ ఎలాంటి ట్వీట్లు వేయలేదు. రిలీజ్ రోజు దాని నోస్టాల్జియా గురించి ఏదైనా వీడియో కానీ పోస్టర్ కానీ షేర్ చేయలేదు. మొన్న వచ్చిన మెగా విక్టరీ కాంబో సాంగ్ ప్రోమోతో పాటు దానికి సంబంధించిన కంటెంట్స్ తన హ్యాండిల్ లో పోస్ట్ చేశారు.

ఒకవేళ వెంకటేష్ కనక ఇండియాలో అందుబాటులో ఉండి ఉంటే నువ్వు నాకు నచ్చావ్ కు ప్లస్ అయ్యేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. శివ, మన్మథుడుకి నాగార్జున అలా స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకోవడం వల్లే దాని ప్రభావం సానుకూలంగా కలెక్షన్ల మీద పడింది.

కానీ నువ్వు నాకు నచ్చావ్ కు ఆ హడావిడి మిస్సవుతోంది. దీనికి తోడు జల్సా, మురారిలు ఇదే టైంలో రావడంతో రెండోసారి రీ రిలీజైనా సరే యూత్ వాటికే ఎగబడిన వైనం ప్రధాన కేంద్రాల్లో కనిపించింది. ఏది ఏమైనా నువ్వు నాకు నచ్చావ్ కు టైమింగ్ సరిగా కుదరలేదన్నది వాస్తవం. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్లాన్ చేస్తే బెటరేమో.