విజయ్ సినిమా అంటున్నా.. బాలయ్యే కనిపిస్తున్నాడు

ఈ రోజుల్లో రీమేక్ అనగానే ప్రేక్షకులు ఆసక్తి కోల్పోతున్నారు. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల ఏ భాష సినిమా అయినా సరే అందరూ చూసేస్తుండమే అందుక్కారణం. చూడకపోయినా సినిమా విశేషాలు తెలిసిపోతుండడంతో ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ఉండట్లేదు. ఈ నేపథ్యంలో తమ సినిమా రీమేక్ అని చెప్పుకోవడానికి చిత్ర బృందాలు ఇష్టపడట్లేదు.
ఈ సినిమా చూస్తే ఇది రీమేక్ అనరు, ఒరిజినల్‌ను మించి ఇందులో చాలా ఉంటాయి అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’ రీమేక్ అన్న అనుమానం ఎప్పుడో మొదలైంది. నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ పాయింట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ దీన్ని రీమేక్ అని ఒప్పుకోవడానికి టీం ఇష్టపడట్లేదు.
ఇటీవల ‘జననాయగన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు వినోద్ మాట్లాడుతూ.. ఇది రీమేకా అని అడిగితే, తాను ఏం చెప్పలేనని.. కానీ ఇది ‘విజయ్ సినిమా’ అని మాత్రం చెప్పగలనని అన్నాడు.

తర్వాత ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించాడు. ఒరిజినల్‌తో పోలిస్తే చాలా మార్పులు చేసినట్లు కూడా చెప్పుకొచ్చాడు. మరోవైపు ‘భగవంత్ కేసరి’ దర్శకుడు అనిల్ రావిపూడిని ‘జననాయగన్’ గురించి అడిగితే.. ఇది విజయ్ సినిమా అంటున్నారని, ఈ చిత్రంలో తాను భాగమా కాదా అన్నది రిలీజయ్యాకే తెలుస్తుందని అన్నాడు. ఐతే ఎవరేమంటున్నా సరే.. ఈ సినిమా ప్రోమోలు చూస్తే మాత్రం ‘భగవంత్ కేసరి’ పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.

‘దళపతి కచ్చేరి’ పాట.. ‘ఇచ్చి పాడ్’ పాటను గుర్తుకు తెచ్చింది. ఇంకా ఈ సినిమా ప్రోమోల్లో విజయ్, మామిత బైజు, పూజా హెగ్డేల లుక్స్.. బాలయ్య, శ్రీలీల, కాజల్‌లను పోలి ఉన్నాయి. చాలా సన్నివేశాలను ఒరిజినల్ నుంచి తీసుకున్నట్లుగా ప్రోమోలను బట్టి తెలుస్తోంది. చిన్న చిన్న మార్పులు చేసి ఉండొచ్చు కానీ.. ‘భగవంత్ కేసరి’లో మేజర్ పోర్షన్లన్నీ తీసుకున్నట్లే కనిపిస్తోంది. కాబట్టి ఇది రీమేక్‌ కాని రీమేక్ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేనట్లే.