ఫైటింగ్ ముగిసింది… కలిసి ప్రమోషన్లు చేస్తున్నారు

ముందు ‘వానర’ అనే పేరుతో తెరకెక్కి.. రిలీజ్ ముంగిట ‘వనవీర’ అని పేరు మార్చుకుంది ఓ సినిమా. అవినాష్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించడంతో పాటు తనే స్వయంగా లీడ్ రోల్ చేశాడు. నూతన సంవత్సర కానుకగా గురువారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల సినిమా పేరు మార్చిన సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో దర్శకుడు, హీరో అవినాష్ చేసిన ప్రసంగం చర్చనీయాంశం అయింది.

రిలీజ్ ముంగిట పేరు విషయంలో వివాదం తలెత్తడం వల్ల తాము పడ్డ ఇబ్బంది గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడ్డమే కాక.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు ప్రమోషన్లకు రావడం లేదని, కనీసం దీని గురించి ఒక సోషల్ మీడియా పోస్టు కూడా పెట్టట్లేదని విమర్శించాడు అవినాష్.

అతను పేరు చెప్పకపోయినా.. అది నందు గురించి అని అందరికీ అర్థమైంది. ‘వనవీర’లో అతను విలన్ పాత్ర పోషించాడు. నందు హీరోగా చేసిన ‘సైక్ సిద్దార్థ’ కూడా గురువారమే రిలీజవుతుండడం విశేషం. ‘వనవీర’ దర్శకుడు చేసిన విమర్శలు తన గురించే అని ఒప్పుకున్న అతను.. ప్రమోషనల్ ఈవెంట్ గురించి తనకు ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే రాలేకపోయానని చెప్పాడు. కట్ చేస్తే.. ఇప్పుడు అవినాష్, నందు కలిసి ఉమ్మడిగా ప్రమోషన్లు మొదలుపెట్టడం విశేషం.

ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శల నేపథ్యంలో ఫన్నీ కాన్సెప్ట్‌తో వీడియోను రూపొందించారు. పైగా మంచిగానే మాట్లాడుతూ.. లోలోపల పంచులు వేసుకుంటున్నట్లుగా ఈ వీడియోను తీర్చిదిద్దారు. వివాదాన్ని కూడా ప్రమోషన్లకు అనుకూలంగా మలుచుకునేలా అవినాష్, నందు స్పోర్టివ్ స్పిరిట్‌తో వ్యవహరించడం, తమ చిత్రాలను ప్రమోట్ చేసుకోవడం సోషల్ మీడియా దృష్టిని బాగానే ఆకర్షిస్తోంది.

ఇంకోపక్క ఇదంతా ప్రీ ప్లానింగ్ అని, అటెన్షన్ పొందాలని చేసిన ప్రమోషనల్ స్టంట్ అని సోషల్ మీడియా యువత సెటైర్లు వేస్తుంది. ఏదైతేనేం రెండు సినిమాలకు మంచి బజ్ వచ్చింది. మరి రేపు రెండు సినిమాల్లో ఏది గెలుస్తోందో చూడాలి.