గంట కంటెంట్‍ కూడా దొరకట్లేదా బాస్‍!

బిగ్‍బాస్‍ సీజన్‍ 4 చివరి వారానికి చేరుకుంటోంది. శనివారం వచ్చేసింది కాబట్టి ఇక చివరిగా మిగిలే అయిదుగురు ఎవరనేది సాయంత్రానికి తెలిసిపోతుంది. ఈ సీజన్‍లో ఏ టాస్క్ ఇచ్చినా కానీ అతి తెలివితో ఆలోచించి ఎవరూ సరిగ్గా ఆడలేదు. ఎక్కడ జనం దృష్టిలో బ్యాడ్‍ అవుతారోననే భయంతో కొందరు చాలా సేఫ్‍ ఆడేసారు. ఆడియన్స్ కూడా కెమెరాల ముందు నటిస్తోన్న కొందరిని గుర్తించలేక పప్పులో కాలేసారు. అటు చేసి, ఇటు చేసి చివరకు మిగిలిన ఆరుగురిలో కొందరు అనర్హులున్నారు. ఈ సీజన్‍ ఎంత నిస్సారంగా నడిచిందంటే టాప్‍ 5 ఎవరనేది తేలిపోయే వారంలో కూడా ఒక్క రోజుల్లో గంట సేపు వేసుకునే కంటెంట్‍ బిగ్‍బాస్‍కు దొరకడం లేదు. పది గంటలకు షో టైమ్‍ని మార్చేసిన బిగ్‍బాస్‍ మొత్తంగా గంట సేపు మాత్రమే ప్రసారం చేస్తున్నారు. అందులో పావుగంట యాడ్లే వుంటాయి. దీన్ని బట్టి ఈ సీజన్‍ ఎంత యూజ్‍లెస్‍గా తయారయిందనేది అర్థమవుతోంది.

దీనికి తోడు ఎవరిని బయటకు పంపించాలనే విషయంలో హౌస్‍మేట్స్ కుతంత్రాలు రచించడం కూడా ప్రేక్షకుల కన్ను కప్పుతోంది. ఓట్లు వేసేది ఎక్కువగా యువత కావడంతో చాలా మందికి వ్యక్తిత్వాన్ని అనలైజ్‍ చేసి ఓట్లు వేసే పరిణితి లేదు. గత వారం మోనల్‍ తనను తన్నిందంటూ అవినాష్‍ నానా హంగామా చేసాడు. అది పొరపాటున జరిగిన విషయం అయినా కానీ ఆమెను బ్యాడ్‍ చేసి తాను బతికిపోవాలని ట్రై చేసాడు. అలాగే ఈవారం అతడి స్నేహితురాలు అరియానా అదే సూత్రం అప్లయ్‍ చేసింది. సోహైల్‍ని రెచ్చగొట్టి మరీ అతడి దగ్గర మహిళలకు భద్రత లేదనే సందేశాన్ని జనంలోకి పంపించాలని చూసింది. ఇక జనం మెప్పు పొందిన అభిజీత్‍ ఎక్కడున్నాడనేది వెతుక్కోవాల్సి వస్తోంది. బిగ్‍బాస్‍ ఎడిటర్లు అతడిని, హారికను బ్యాక్‍గ్రౌండ్‍కే పరిమితం చేసేస్తూ శాడిజం చూపిస్తున్నారు.