ఐ బొమ్మ రవి.. గత రెండు నెలలుగా మార్మోగుతున్న పేరు. కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలను పైరసీ చేస్తూ పెద్ద ఎత్తున ఫాలోవర్లను సంపాదించుకున్న వెబ్ సైట్ వెనుక ఉన్నది ఎవరో చాలా ఏళ్ల పాటు ఎవరికీ తెలియలేదు. ఆ సైట్‌ను నడిపిస్తున్నది రవి అనే వ్యక్తి అని అతణ్ని హైదరాబాద్ పోలీసులు నవంబరు నెలాఖరులో అరెస్టు చేసినపుడే వెల్లడైంది. పోలీసుల విచారణలో రవి పైరసీ వ్యవహారం గురించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సైట్ ద్వారా రూ.20 కోట్లకు పైగానే అతను వెనకేసినట్లు వెల్లడైంది. రవిపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. అతణ్ని రిమాండులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తాజాగా రవిని కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా మీడియా ప్రతినిధులు అతడితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒక టీవీ ఛానెల్ ప్రతినిధి.. రవి నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించగా.. అతను పెద్దగా మాట్లాడలేదు. పైగా రిపోర్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఐబొమ్మ రవి, ఐబొమ్మ రవి అంటూ రవితో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధి ప్రయత్నించగా.. నా పేరేంటి అంటూ అతను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా రిపోర్టర్ రవి అని అంటే.. మరి ఐబొమ్మ రవి అని ఎందుకు అంటున్నారంటూ కోపంగా మాట్లాడాడు రవి. సినిమాలను పైరసీ చేయడం, బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించడం గురించి మీరేమంటారు అని అడిగితే.. రవి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
కోర్టులో మాట్లాడుకుందాం అంటూ సమాధానం దాటవేశాడు. పోలీసులు అతణ్ని జీపు ఎక్కించే వరకు వెంటాడిన మీడియా ప్రతినిధి.. అతను జీపులో కూర్చున్నాక కూడా ప్రశ్నలు కొనసాగించాడు. కానీ రవి మాత్రం సమాధానం ఇవ్వలేదు. అదే అసహనాన్ని కొనసాగిస్తూ.. కోర్టులో మాట్లాడుకుందాం అన్నాడు. పోలీసులు అతణ్ని వదిలేయండి అని చెప్పడంతో మీడియా ప్రతినిధి ఏమీ చేయలేకపోయాడు. ఐబొమ్మ వెబ్ సైట్‌తో కోట్లు సంపాదించిన వ్యక్తి.. ఇప్పుడా వెబ్ సైట్ పేరు చెబితే ఇంత అసహనానికి గురవడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates