ఈ వారం రెండు రీ రిలీజులు వస్తున్నాయి. ఒకటి మహేష్ బాబు మురారి. రెండు పవన్ కళ్యాణ్ జల్సా. ఇవి గతంలోనే ఒకటి రెండుసార్లు విడుదలై భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నవి. కానీ ఇప్పుడు న్యూ ఇయర్ సాకుగా చూపి మళ్ళీ మరోసారి థియేటర్లకు తీసుకొస్తున్నారు.
మురారికి టికెట్ రేట్ 99 రూపాయలే అంటూ హైలైట్ చేస్తూ ప్రేక్షకులకు గొప్ప ఫేవర్ చేస్తున్నామనే రీతిలో పబ్లిసిటీ చేస్తున్నారు. ఇంత తక్కువ ధర గతంలో ఎవరూ పెట్టని మాట వాస్తవమే అయినా కొన్ని నెలల క్రితం ఇదే మురారి వచ్చినప్పుడు ఆ పని ఎందుకు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. కేవలం ఆరు నెలల గ్యాప్ లో రెండోసారి తేవడం సరికాదు.
ఒకపక్క కొత్త సినిమాలు బాగానే ఆడుతున్న టైంలో ఇలా ఆడేసిన సినిమాలను మళ్ళీ మళ్ళీ తేవడం వల్ల వాటి క్లాసిక్ వేల్యూ తగ్గిపోతుంది. స్టార్ మా ఛానల్ లో వెయ్యిసార్లకి పైగా అతడుని అరిగిపోయే దాకా టెలికాస్ట్ చేసినట్టు ఇలా పదే పదే మురారి లాంటి వాటిని రుద్దితే ఫ్యాన్స్ లోనే ఇంటరెస్ట్ తగ్గిపోయే ప్రమాదముంది.
థర్డ్ పార్టీ విడుదల కావడంతో జల్సాని పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. గత ఏడాది మొదటిసారి వచ్చినప్పుడు చాలా చోట్ల దీనికి రికార్డులు దక్కాయి. ప్రతిసారి రీ రిలీజులకు ఒకే రెస్పాన్స్ రాదు. శివని బాగా చూసిన ప్రేక్షకులు కొదమ సింహం, సోగ్గాడును పట్టించుకోలేదు.
కృష్ణ, మహేష్ బాబు పుట్టినరోజులను ఇలాంటి సినిమాలతో సెలెబ్రేట్ చేస్తే బాగుంటుంది కానీ అకేషన్ వచ్చింది కదాని నూతన సంవత్సరాన్ని కూడా వాడేసుకోవడం కేవలం క్యాష్ చేసుకోవడమే అనిపిస్తుంది. అసలే మహేష్ ఫ్యాన్స్ కరువు మీద ఉన్నారు.
గుంటూరు కారం తర్వాత ఇప్పటికే రెండేళ్ల గ్యాప్ వచ్చేసింది. వారణాసి 2027లో రిలీజ్ అవుతుంది. సో మరో ఏడాదిన్నర దాకా సూపర్ స్టార్ ని తెరమీద చూడాలంటే టీవీలు స్మార్ట్ ఫోన్లు తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్ చేయమని మురారి లాంటివి వదులుతున్నారు. త్వరలో పోకిరి, ఒక్కడు ఇంకో రౌండ్ కోసం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates