కరోనా ఇండియాలో జనాల్ని వణికించేస్తున్న సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆ మహమ్మారి బారిన పడటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఆయన వయసు 78 ఏళ్లు కావడమే ఆందుకు ప్రధాన కారణం. వృద్ధుల మీద కరోనా ఎక్కువ చూపుతుందన్న భయం అభిమానులను వణికించింది.
ఐతే అదృష్టవశాత్తూ ఆయన కరోనాపై విజయం సాధించారు. మళ్లీ ఆరోగ్యవంతుడయ్యారు. ఐతే కరోనా అనంతర బడలిక నేపథ్యంలో వెంటనే ఆయనేమీ షూటింగ్‌లకు వెళ్లిపోలేదు. కొన్ని నెలలుగా విశ్రాంతిలోనే ఉన్నారు. ఐతే ఎట్టకేలకు ఆయన మళ్లీ షూటింగ్‌కు రెడీ అయ్యారు.
అమితాబ్ రీఎంట్రీకి వేదిక అవుతోంది హైదరాబాదే కావడం విశేషం. లాక్ డౌన్ తర్వాత అమితాబ్ ఒప్పుకున్న తొలి చిత్రం.. మే డే. అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించనున్న చిత్రమిది. శుక్రవారమే హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. హిందీ సినిమాలు చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీ లాంటి చోట్లకు రావడం మామూలే కానీ.. ఇలా నగరంలో వేరే చోట సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడం అరుదు.
సినిమా ప్రారంభోత్సవం, తొలి షెడ్యూల్ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ను అజయ్ ఎంచుకున్నాడంటే ఏదో ప్రత్యేక కారణమే ఉంటుంది. ఈ షెడ్యూల్‌లో అమితాబ్‌తో పాటు ఇందులో కీలక పాత్ర పోషించనున్న రకుల్ ప్రీత్ సైతం పాల్గొనబోతోంది. భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ సినిమాను 2022 ఏప్రిల్ 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రారంభోత్సవం రోజే ప్రకటించాడు అజయ్.