విజయ్ మాట మీద ఉండాల్సిందేనా

మలేషియాలో జరిగిన జన నాయకుడు ఈవెంట్ లో ఇదే తన చివరి సినిమా అని ప్రకటించిన విజయ్ భవిష్యత్తులో ఇదే మాట మీద ఉంటాడానే అనుమానాలు కోలీవుడ్ వర్గాల్లో తలెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో ఎందరో స్టార్లు ఇలాంటి మాటలు చెప్పి తర్వాత తిరిగి మేకప్ వేసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి.

మన దగ్గర చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి సీనియర్లు ఉదాహరణగా కనిపిస్తే తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ ఎగ్జాంపుల్ గా ఉన్నారు. అయితే విజయ్ ఫ్యాన్స్ ఇంకో వెర్షన్ చెబుతున్నారు. తమ నాయకుడు ఎంజిఆర్, జయలలిత లాగా సీరియస్ పాలిటిక్స్ చేసి మళ్ళీ సినిమాల్లోకి రారని బల్లగుద్ది చెబుతున్నారు.

వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి. అందులో గెలిచేసి ముఖ్యమంత్రి అయిపోతాననే భ్రమలో విజయ్ లేడు. ఒకవేళ పట్టం కడితే సంతోషమే. తేవాలనుకున్న మార్పు ముందుగానే సాధ్యమవుతుంది. లేదూ అంటే ఇంకో అయిదు సంవత్సరాల టైం దొరుకుతుంది. మరింత ప్రణాళికతో ముందుకు వెళ్లొచ్చు.

విజయ్ వయసు ప్రస్తుతం 51 సంవత్సరాలు, ఇంకో ముప్పై ఏళ్ళు పాలిటిక్స్ లోనే ఉంటానని చెబుతున్నాడు. ఒకవేళ పార్టీ పెట్టకుండా ఇండస్ట్రీలోనే కొనసాగి ఉంటే సులభంగా వంద సినిమాల మైలురాయి అందుకునే అవకాశం ఉండేది. తెలిసి మరీ వదులుకోవడం విజయ్ కమిట్ మెంట్ కి నిదర్శనం.

అయితే యాంటీ ఫ్యాన్స్ ఇంకోలా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఎలక్షన్లలో ఓడిపోతే విజయ్ తిరిగి మళ్ళీ సినిమాల్లోకి వస్తాడని, ఎప్పుడు వచ్చినా జనం ఎలాగూ ఆదరిస్తారు, నిర్మాతలు కోట్లు ఇస్తారు కాబట్టి నిర్ణయం మార్చుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదంతా తేలాలంటే ఇంకో రెండేళ్లు ఈజీగా పడుతుంది.

రజని త్వరలో రిటైర్ కాబోతున్నారు. కమల్ హాసన్ మెల్లగా నటించడం తగ్గించే ఆలోచనలో ఉన్నారు. అజితే రెండేళ్లకు ఒకటి చేస్తే గొప్ప. విక్రమ్, సూర్య మార్కెట్ తగ్గిపోయింది. కార్తీ, శివ కార్తికేయన్ లాంటి వాళ్ళు ఇంకా టయర్ 2లో ఉన్నారు. మరి విజయ్ స్థానం ఎవరు తీసుకుంటారనేది ఇప్పట్లో సమాధానం దొరకని ప్రశ్న.