మహేష్-వంశీ.. క్రేజీ రూమర్


ఇప్పటిదాకా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ సినిమా తీసిన ఘనత వంశీ పైడిపల్లిదే. వీరి కలయికలో గత ఏడాది వచ్చిన ‘మహర్షి’ సినిమాకు దాదాపు వంద కోట్ల ఖర్చయింది. ఆ సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజిలో జరిగింది. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాగోలా గట్టెక్కేసి ‘హిట్’ అనిపించుకుంది.

ఈ ఊపులో వంశీతో మహేష్ ఇంకో సినిమా చేయాలనుకున్నాడు కానీ.. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. మహేష్‌కు కథ నచ్చకే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసి పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ను లైన్లో పెట్టాడని వార్తలొచ్చాయి. మరి వంశీ పరిస్థితేంటి అని అంతా అనుకున్నారు. మహేష్‌ నో చెప్పి పది నెలలువుతున్నా కూడా వంశీ కొత్త సినిమా గురించి ఏ కబురూ వినిపించలేదు. కానీ ఇప్పుడు అతడి తర్వాతి ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది.

వంశీ తన తర్వాతి సినిమాను మళ్లీ మహేష్ బాబుతోనే చేయబోతున్నాడట. ఈసారి వేరే కథ చెప్పి మహేష్‌ను మెప్పించాడట. వీరి కలయికలో ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ రాబోతోందట. ఆ చిత్రానికి ‘స్టేట్ రౌడీ’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారట. ఇదీ రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారం. మామూలుగా అయితే లైట్ తీసుకునేవాళ్లేమో కానీ.. మహేష్ భార్య తాజాగా రిలీజ్ చేసిన ఒక ఫొటో ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.

మహేష్ తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోగా.. అందులో వంశీ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ మళ్లీ కలిశారు అంటే సినిమా లైన్లో ఉన్నట్లే అని భావిస్తున్నారు. నిజంగా మాస్ సినిమానే చేస్తారా.. దానికి చిరంజీవి పాత సినిమా టైటిల్ పెడతారా అన్నది పక్కన పెడితే.. మహేష్-వంశీ కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే అవకాశాల్నయితే కొట్టి పారేయలేమనే అనిపిస్తోంది.