బాల నటుడిగా మంచి పేరు సంపాదించిన వాళ్లందరూ హీరోలు నిలదొక్కుకుంటారనేమీ లేదు. కానీ తేజ సజ్జ మాత్రం హీరోగా మంచి స్థాయినే అందుకున్నాడు. పెద్దవాడయ్యాక ‘ఓ బేబీ’లో సైడ్ క్యారెక్టర్ చేసిన అతను.. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’తో ఓ మోస్తరు ఫలితాన్నందుకున్నాడు. కానీ ‘హనుమాన్’ సినిమా తేజ కెరీర్‌ను మార్చేసింది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయి రూ.300 కోట్ల వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది.
దీని తర్వాత ‘మిరాయ్’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు తేజ. ఇప్పుడు తేజ నటించిన చివరి మూడు చిత్రాలకూ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఐతే జాంబి రెడ్డి-2, మిరాయ్-2 చిత్రాల్లో తేజనే హీరోగా నటించబోతున్నాడన్నది స్పష్టం. ఈ సినిమాల కోసం ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నట్లు తేజ తాజాగా కన్ఫమ్ చేశాడు. కొత్తగా ఇంకే సినిమా ఒప్పుకోలేదని కూడా అతను చెప్పాడు. కానీ ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ గురించి మాత్రం అతనేమీ మాట్లాడలేదు. ఇంతకుముందు కూడా ‘జై హనుమాన్’ గురించి అడిగితే.. అందులో తాను నటిస్తానా లేదా అన్నది తెలియదన్నాడు.
‘జై హనుమాన్’ హనుమంతుడి పాత్ర మీదే నడుస్తుందని.. ఆ పాత్రను రిషబ్ శెట్టి చేయబోతున్నాడని ముందే క్లారిటీ వచ్చింది. అయినా సరే ‘హనుమాన్’ సీక్వెల్ కాబట్టి ఇందులో తేజ సజ్జ లేకుంటే ఎలా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ తేజ మాత్రం ఆ సినిమాలో తాను నటిస్తానని చెప్పట్లేదు. అలా అని దర్శకుడు ప్రశాంత్ వర్మతో అతడికి ఏమైనా చెడిందా అంటే అదేమీ లేదు. ‘జాంబిరెడ్డి-2’కు ప్రశాంతే కథ అందించాడు.
మరి ‘జై హనుమాన్’లో తేజ పాత్రను పూర్తిగా పక్కన పెట్టేయడానికి కారణమేంటో తెలియట్లేదు మరి. ప్రస్తుతానికి ఏమీ అనుకోకపోయినా.. సినిమా తెరకెక్కే వ్యవహారం మారొచ్చని.. అందులో తేజ కొన్ని నిమిషాలైనా కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ‘కాంతార’ నుంచి ఇటీవలే ఖాళీ అయిన రిషబ్.. జనవరి నుంచి ‘జై హనుమాన్’లో నటిస్తాడని.. ఆరు నెలలు ఈ సినిమాకు డేట్లు ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates