సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాల్లో ‘మురారి’ ఒకటి. కృష్ణ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలనటుడిగా అడుగు పెట్టిన అతడికి ఆ వయసులోనే స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆపై పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేసినపుడు ఇంకా ఘనమైన ఆరంభమే దక్కింది. తొలి రెండు చిత్రాలు ‘రాజకుమారుడు’, ‘యువరాజు’ విజయవంతం అయ్యాయి.
ఐతే మహేష్‌ను ఒక పెర్ఫామర్‌గా నిలబెట్టింది మాత్రం ‘మురారి’నే. లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రయోగాత్మక కథతో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో మహేష్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ప్రాణాపాయం ఉందని బయటపడ్డ దగ్గర్నుంచి చివరి వరకు మహేష్ నుంచి పీక్ పెర్ఫామెన్స్ చూడొచ్చు.
‘మురారి’ ఈ నెల 31న మరోసారి రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు కృష్ణవంశీ ఈ పెర్ఫామెన్స్ గురించి ఎక్స్‌లో స్పందించారు. ‘మురారి’ క్లైమాక్స్ గురించి ఒక సీక్రెట్ కూడా బయటపెట్టారు.
కథలో భాగంగా మురారి కోసం వేదపండితులు మృత్యుంజయ హోమం చేస్తారన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ సన్నివేశం కోసం నిజమైన వేద పండితులనే పిలిచి.. మురారి కాకుండా మహేష్ పేరు మీద ఆ హోమం చేయించినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. మూడు గంటల పాటు నిష్టగా ఈ హోమం జరిగిందని ఆయన తెలిపారు.
ఆ హోమం జరుగుతుండగా.. మధ్యలో అక్కడక్కడా కొన్ని షాట్స్ తీశామన్నారు. చివర్లో పూర్ణాహుతిని నిజంగానే మహేష్ బాబుతో చేయిస్తే.. దాన్నే సినిమాలో కూడా ప్రేక్షకులు చూశారని ఆయన తెలిపారు. తర్వాత సంకల్పం గురించి మహేష్ డైలాగ్ చెప్పే సీన్.. నటుడిగా తనకు, దర్శకుడికి తనకు పెద్ద ఛాలెంజ్ అని కృష్ణవంశీ తెలిపారు.
ఓవైపు తాను మృత్యువుకు దగ్గరగా ఉన్నాననే నిజాన్ని జీర్ణించుకోవడం.. ఇంకోవైపు శబరిని, కుటుంబ సభ్యులను ఓదార్చడం.. మరోవైపు ఏదో బోధనలు చేస్తున్నట్లు కాకుండా అందరిలో ధైర్యం నింపేలా మాట్లాడ్డం.. ఇలా ఎన్నో కోణాలున్న సన్నివేశం ఇదని.. దీన్ని మహేష్ అద్భుతంగా అభినయించి మెప్పించాడని కొనియాడాడు కృష్ణవంశీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates