లిటిల్ హార్ట్స్… ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో దీన్ని మించిన సెన్సేషన్ లేదు. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా దాదాపు 35 కోట్ల వసూళ్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. థియేటర్లలో మూడు వారాల పాటు హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయిందీ చిత్రం. ఐతే థియేటర్లలో బాగా ఆడుతుండగానే.. ముందే జరిగిన డీల్ ప్రకారం థియేట్రికల్ రిలీజ్ నుంచి నాలుగు వారాలకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ మొదలయ్యాక లిటిల్ హార్ట్స్ అక్కడా మంచి స్పందనే తెచ్చుకుంది. తెలుగు సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు ఆ సినిమా గురించి చర్చించుకున్నారు. మామూలుగా కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్ద హిట్టయి, ఓటీటీలోకి వచ్చాక ‘ఓవర్ రేటెడ్’ ట్యాగ్ తెచ్చుకుంటూ ఉంటాయి. ఈ సినిమాను ఎందుకంత పెద్ద హిట్ చేశారు అని ఓటీటీ ఆడియన్స్ ఆశ్చర్యపోతుంటారు. కానీ ‘లిటిల్ హార్ట్స్’ విషయంలో అలా జరగలేదు.
విశేషం ఏంటంటే.. రోజులు గడిచేకొద్దీ ఓటీటీలో ‘లిటిల్ హార్ట్స్’ రీచ్ ఇంకా ఇంకా పెరుగుతోంది. ఈ సినిమాను ఇప్పుడు ఇతర భాషల వాళ్లు కూడా ఆదరిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ‘లిటిల్ హార్ట్స్’ను రిలీజ్ చేసింది. అందులో తమిళ జనాలు ‘లిటిల్ హార్ట్స్’ చూసి ఊగిపోతున్నారు. ఈ సినిమా సూపర్ అని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇందులో కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉందని.. చాన్నాళ్ల తర్వాత కడుపుబ్బ నవ్వుకున్నామని.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ అదిరిపోయిందని.. మ్యూజిక్ కూడా చాలా బాగుందని కొనియాడుతున్నారు తమిళ జనాలు. సాధారణంగా తమిళులు వేరే భాషల సినిమాలను ఆదరించడం, పొగడ్డం అరుదు. కానీ ‘లిటిల్ హార్ట్స్’ మాత్రం అందుకు మినహాయింపు. ఇలాంటి చిన్న సినిమా తెలుగు వాళ్లను ఉర్రూతలూగించి, ఇప్పుడు ఇతర భాషల వాళ్లనూ ఆకట్టుకుంటూ ఉండడం గొప్ప విషయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates