రాష్ట్ర‌ప‌తితో మ‌న మీమ్స్ గాడ్

నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా సుదీర్ఘ కెరీర్. అందులో మూడు ద‌శాబ్దాల పాటు తెలుగులో నంబ‌ర్ వ‌న్ క‌మెడియ‌న్‌గా తిరుగులేని ఆధిప‌త్యం. భిన్న త‌రాల వాళ్ల‌ను న‌వ్వుల్లో ముంచెత్తగ‌ల అరుదైన నైపుణ్యం.. ఎన్నో సినిమాల్లో హీరోల‌ను మించి ఎంట‌ర్టైన్ చేసి ఆయా చిత్రాల విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించిన ఘ‌న‌త‌.. ఇలా చెప్పుకుంటూ పోతే బ్ర‌హ్మానందం ప్ర‌త్యేక‌త‌ల గురించి చాలానే ఉంది.

మ‌ధ్య‌లో కొన్నేళ్లు కొంచెం గ్యాప్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఈ మ‌ధ్య మ‌ళ్లీ సినిమాల్లో త‌ర‌చుగా క‌నిపిస్తూ న‌వ్వులు పంచుతున్నాడీ హాస్య బ్ర‌హ్మ‌. తాజాగా గుర్రం పాపిరెడ్డి చిత్రంలో జ‌డ్జి పాత్ర‌లో ఆయ‌న త‌న‌దైన శైలిలో న‌వ్వులు పండించాడు. బ్ర‌హ్మానందం అంటే సినిమా వాళ్ల‌కే కాదు.. వివిధ రంగాల వాళ్ల‌కు అపార‌మైన ప్రేమ‌, గౌర‌వం. ఆయ‌న ప్ర‌తిభ గురించి జాతీయ స్థాయిలో అంద‌రికీ తెలుసు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము మ‌న న‌వ్వుల రేడును ప్ర‌త్యేకంగా క‌లిశారు. ఆయ‌న్ని స‌గౌర‌వంగా స‌త్క‌రించారు.

గ‌త మూడు రోజులుగా హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తున్నారు ద్రౌప‌ది ముర్ము. శుక్ర‌వారం రామోజీ ఫిలిం సిటీలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి పాల్గొన్నారు. త‌ర్వాతి రెండు రోజులు కూడా వివిధ కార్య‌క్ర‌మాలకు హాజ‌ర‌య్యారు. ఆదివారం ఆమె హైద‌రాఆద్‌లోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో సేద‌దీరారు. బ్ర‌హ్మానందం అక్క‌డికి వెళ్లి ద్రౌప‌దీ ముర్మును క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి శాలువాతో ఆయ‌న్ని స‌త్క‌రించారు. ప్ర‌తిగా బ్ర‌హ్మానందం త‌న స్వ‌హ‌స్తాల‌తో లిఖించిన ఆంజ‌నేయ స్వామి చిత్ర‌ప‌టాన్ని ద్రౌప‌దీ ముర్ముకు బ‌హుక‌రించారు. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అయిన‌ బ్ర‌హ్మానందంలో అద్భుత‌మైన చిత్ర‌క‌ళ ఉన్న సంగ‌తి తెలిసిందే. తీరిక వేళ‌ల్లో ఆయ‌న బొమ్మ‌లు గీయ‌డం మీదే దృష్టిసారిస్తారు. వాటిని ప్ర‌ముఖుల‌కు, స‌న్నిహితుల‌కు ప్రెజెంట్ చేస్తుంటారు. రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన సంద‌ర్భంగానూ ఆయ‌న ఈ జ్ఞాపిక‌నే అంద‌జేశారు.