భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, అతి పెద్ద స్టార్లలో ఒకడైన ధర్మేంద్ర ఇటీవలే కాలం చేశారు. ‘షోలే’ సహా అనేక చిత్రాలతో ఆయన భారతీయ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ధర్మేంద్ర మరణానంతరం ఆయన జ్ఞాపకాలు అభిమానులను వెంటాడుతున్నాయి. కదిలిస్తున్నాయి. తాజాగా ధర్మేంద్ర తనయుడు సన్నీ డియోల్.. తన తండ్రి అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసే ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
అది ధర్మేంద్ర తన చివరి చిత్రం ‘ఇక్కీస్’ ఆఖరి రోజు షూటింగ్ సందర్భంగా తీసింది కావడం గమనార్హం. దర్శక నిర్మాతలతో పాటు టీం అంతటికి థ్యాంక్స్ చెబుతూ.. చాలా ఎమోషనల్‌గా మాట్లాడిన వీడియో అది. షూట్ చివరి రోజు కావడంతో ఈ టీంను తాను మిస్సవుతానని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు ఆయన ఒక కోరికను ఈ వీడియోలో బయటపెట్టారు.
తన చివరి చిత్రాన్ని భారత్, పాకిస్థాన్ ప్రజలు చూడాలని కోరుకుంటున్నట్లు ధర్మేంద్ర వెల్లడించారు. కానీ ఈ లెజెండరీ నటుడి ఆఖరి కోరిక తీరడం కష్టమేనని చెప్పాలి. కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది పహల్గాం ఉగ్ర దాడి అనంతరం అవి మరింత క్షీణించాయి. ఇండియన్ మూవీస్ ఏవీ పాకిస్థాన్‌లో రిలీజ్ కావడం లేదు.
పాకిస్థాన్ ఆర్టిస్టులు కూడా ఒకప్పట్లా బాలీవుడ్ సినిమాల్లో నటించే పరిస్థితి లేదు. సమీప భవిష్యత్తులో కూడా ఇండియన్ సినిమాలు పాకిస్థాన్‌లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ధర్మేంద్ర, జైదీప్ అహ్లావత్ కలయికలో తెరకెక్కిన ‘ఇక్కీస్’ మూవీ జనవరి 1నే రిలీజ్ కానుంది. ‘అంధాదున్’ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. పాకిస్థాన్‌లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎంతమాత్రం లేవు కాబట్టి ధర్మేంద్ర ఆఖరి కోరిక తీరనట్లే.
Gulte Telugu Telugu Political and Movie News Updates