‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. బయట వాయిదా ప్రచారాలు ఎన్ని జరుగుతున్నా మార్చ్ 26 రావడం కన్ఫర్మ్ అని టీమ్ పదే పదే స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సంపూర్ణేష్ బాబు లుక్ రిలీజ్ చేసిన టీమ్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. ఎందుకంటే కొబ్బరిమట్ట, సింగం 123, హృదయ కాలేయం లాంటి స్పూఫ్ సినిమాల ద్వారా పాపులర్ అయిన సంపూని నాని స్నేహితుడిగా ఇంత వయొలెంట్ క్యారెక్టర్ లో చూపిస్తాడని ఎవరూ ఊహించరు. అందులోనూ ఇంటెన్స్ గా డిజైన్ చేయడం విశేషమే.

క్యాస్టింగ్ విషయంలో శ్రీకాంత్ ఓదెలని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. చాలా క్రేజీ కాంబోలు సెట్ చేస్తున్నారు. ఎంతో సెలెక్టివ్ గా మారిపోయిన మోహన్ బాబుని ఏకంగా విలన్ పాత్రకు ఒప్పించారు. కిల్ తో నేషన్ వైడ్ ఇమేజ్ తెచ్చుకున్న రాఘవ్ జుయల్ ని ఆయన కొడుకుగా సెట్ చేయడం మరో స్ట్రాటజీ. ఇప్పుడీ జడల్ ఫ్రెండ్ పాత్ర కోసం సంపూని ఎంపిక చేయడం భారీగా అంచనాలు పెంచేదే. ఇప్పటిదాకా తెలుగు తెరమీద చూడనంత వయొలెంట్ డ్రామా ప్యారడైజ్ లో ఉంటుందని టీమ్ నుంచి లీకులు వస్తున్నాయి. ఆల్రెడీ షూట్ చేసిన జైలు ఎపిసోడ్ కే మైండ్ పోవడం ఖాయమని అంటున్నారు.

ఇక విడుదల విషయానికి వస్తే ప్యాన్ ఇండియా సినిమాలు చివరి నిమిషం దాకా డేట్ల మీద దోబూచులాడటం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. పెద్ది కావొచ్చు లేదా ప్యారడైజ్ అవొచ్చు నిజంగా ఎవరు మాట మీద ఉంటారనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రమోషన్ల పరంగా చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయబోతున్న ప్యారడైజ్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం కీలకం కానుంది. చేతిలో మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ సెన్సార్ తో సహా అన్ని అయిపోవాలి. గాసిప్స్ కి చెక్ పెడుతూ వీలైనంత వేగంగా పరుగులు పెట్టిస్తే డెడ్ లైన్ అందుకోవడం కష్టం కాదు.