సుజీత్‌కు ప‌వ‌న్ కారు ఇచ్చింది అందుకా?

ఒక సినిమా పెద్ద హిట్ట‌యితే ద‌ర్శ‌కుడికి నిర్మాత కారు ఇవ్వ‌డం చాలా సంద‌ర్భాల్లో చూశాం. ఈ మ‌ధ్య ఇదొక ట్రెండుగా మారింది కూడా. నిర్మాత‌లు హీరోల‌కు కూడా ఇలాగే బ‌హుమ‌తులు అంద‌జేస్తుంటారు. ఐతే ఒక హీరో.. ద‌ర్వ‌కుడికి కారు బ‌హుమ‌తిగా ఇవ్వ‌డం మాత్రం అరుదైన విష‌య‌మే. అందులోనూ ఆ ప‌ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌డం ఇంకా అరుదుగా మారింది. త‌న‌కు ఓజీ లాంటి మ‌ర‌పురాని సినిమాను అందించిన‌ ద‌ర్శ‌కుడు సుజీత్‌కు ప‌వ‌న్ ఇటీవ‌లే ల‌గ్జ‌రీ కారును బ‌హుమ‌తిగా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

టాలీవుడ్లో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సోష‌ల్ మీడియాలో కూడా ఈ సంగ‌తి వైర‌ల్ అయింది. ఓజీ త‌న అభిమానుల‌కు అమితానందాన్ని క‌లిగించిన సినిమా కావ‌డంతో ప‌వ‌న్ కూడా చాలా హ్యాపీగా ఫీలై సుజీత్‌కు కారు ఇచ్చాడ‌ని భావించారు. కానీ ఈ కారు బ‌హుమ‌తి వెనుక వ్య‌వ‌హారం వేరే ఉందంటూ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

ఓజీ సినిమా కోసం సుజీత్ సొంతంగా ఖ‌ర్చు పెట్టుకున్న‌ట్లు రిలీజ్ ముంగిట వార్త‌లు రావ‌డం తెలిసిందే. జ‌పాన్ నేప‌థ్యంలో కొన్ని కీల‌క స‌న్నివేశాలు అద‌నంగా తీయాల‌ని సుజీత్ భావించ‌గా.. నిర్మాత దాన‌య్య అప్ప‌టికే సినిమాకు ఓవ‌ర్ బ‌డ్జెట్ అయినందున అందుకు అంగీక‌రించ‌లేద‌ని, దీంతో సుజీత్ ఆ షూట్ కోసం త‌నే డ‌బ్బులు పెట్టుకున్నాడ‌ని, అందుకోసం త‌న ల్యాండ్ రోవ‌ర్ కారును అమ్మేశాడ‌నే చ‌ర్చ జ‌రిగింది. ఈ విష‌యం ఆల‌స్యంగా ప‌వ‌న్ దృష్టికి వ‌చ్చింద‌ని.. అందుకే ఇప్పుడు ఆయ‌న సొంత డ‌బ్బుల‌తో సుజీత్‌కు ల‌గ్జ‌రీ కారు కొని ఇచ్చాడ‌ని అంటున్నారు.

త‌న‌కు వీరాభిమాని అయిన సుజీత్.. అంద‌రు అభిమానుల‌కూ న‌చ్చే సినిమా ఇవ్వ‌డం కూడా ప‌వ‌న్‌కు ఎంతో సంతోషాన్నిచ్చింద‌ని.. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆయ‌న ఈ గిఫ్ట్‌ను అత‌డికి అందించాడనే ఒక ప్ర‌చారం న‌డుస్తోంది. కారు ఈఏంఐ లు కూడా పవన్ కడతారని సమాచారం. గ‌తంలో ఎస్.జె.సూర్య స‌హా కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు ప‌వ‌న్ బ‌హుమ‌తులు ఇచ్చాడు. దాని గురించి పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. కానీ ఇప్పుడు సుజీత్‌కు ఈ కారు బ‌హుమ‌తి ఇవ్వ‌డం మాత్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.