పెళ్ళి వార్తలపై నిప్పులు చెరిగిన హీరోయిన్

‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. మహానుభావుడు, ఎఫ్-2 లాంటి హిట్లూ పడ్డాయి. కానీ ఒక దశ దాటాక వరుస ఫ్లాపులు రావడంతో ఆమె జోరు తగ్గిపోయింది. తెలుగులో దాదాపుగా సినిమాలు ఆగిపోయాయి. 

ఐతే కెరీర్ నెమ్మదిస్తున్న సమయంలోనే హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్యా బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది మెహ్రీన్. కానీ ఏవో కారణాలతో నిశ్చితార్థం రద్దయింది. అప్పట్నుంచి సింగిల్‌గానే ఉంటోంది మెహ్రీన్. ఐతే ఇటీవల ఆమె సైలెంట్‌గా పెళ్లి చేసుకుందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాదంటూ మెహ్రీన్ మండిపడుతూ వివరణ ఇచ్చింది.

తనకు అసలు పరిచయమే లేని వ్యక్తితో పెళ్లి జరిగిందని వార్తలు రాయడంపై ఆమె మండిపడ్డారు. గత రెండేళ్లుగా ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయని.. అయినా మౌనంగా ఉన్నానని.. కానీ ఇప్పుడు స్పందించక తప్పడం లేదని అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘‘ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు వార్త రాశారు. అతడితో నాకు కనీసం పరిచయం కూడా లేదు. నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని నేనే స్వయంగా ప్రపంచానికి తెలియజేస్తాను. దయచేసి నన్ను నమ్మండి’’ మెహ్రీన్ పేర్కొంది. తెలుగులో మెహ్రీన్ నటించిన చివరి పేరున్న సినిమా అంటే ‘ఎఫ్-3’నే. ఆ తర్వాత ‘స్పార్క్’ అనే చిన్న సినిమాలో నటించింది. తర్వాత ఆమె తెలుగులో సినిమా చేయలేదు. ప్రస్తుతం మెహ్రీన్ కన్నడలో ఒక సినిమా చేస్తోంది.