మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు. భైరవం అంచనాలు అందుకోలేకపోయినా మిరాయ్ సూపర్ హిట్ కావడం ఊరటనిచ్చింది. అలాని తనతో సోలో హీరోగా సినిమాలు తీసే నిర్మాతలు లేరని కాదు. కొత్త ప్రాజెక్టులు తెరకెక్కబోతున్నాయి. వాటిలో డేవిడ్ రెడ్డి ఒకటి. చరిత్రలో గుర్తింపు లేకుండా పోయిన ఒక స్వాతంత్ర సమరయోధుడి కథను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి తెరకెక్కించబోతున్నారు. అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చింది కానీ  రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. ఫాన్స్ దీని కోసమే ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడో క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం ఇందులో రెండు ముఖ్యమైన క్యామియోలకు పెద్ద స్టార్ హీరోలు అవసరం కావడంతో ఆ మేరకు ఇద్దరిని సంప్రదించినట్టు తెలిసింది. మొదటి పేరు రామ్ చరణ్. పాత్ర నచ్చింది కానీ చేసేది లేనిది చెప్పలేదట. ఇప్పటిదాకా చరణ్ క్యామియో చేసింది ఆచార్యలో మాత్రమే. అది కూడా తండ్రి చిరంజీవి సినిమా కాబట్టి. మనోజ్ తో ఎంత స్నేహం ఉన్నా మార్కెట్ పరంగా చాలా క్యాలికులేషన్లు, అభిమానుల్లో అంచనాలు ఉంటాయి కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోలేడు. రెండో పేరు కోలీవుడ్ స్టార్ శింబు. దాదాపు ఓకే అన్నట్టు తెలిసింది.

మనోజ్ తో శింబుతో ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి ఇందులో కూడా ఆశ్చర్యం లేదు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ ఎపిక్ మూవీలో ఇంకా చాలా విశేషాలు ఉండబోతున్నాయట. ఏది ఏమైనా మంచు మనోజ్ కు మంచి టైం అయితే వచ్చింది. అన్నయ్య విష్ణు కన్నప్ప తర్వాత ఇంకే సినిమా కమిట్ కాలేదు కానీ మనోజ్ మాత్రం రెండు మూడు లైన్ లో పెడుతున్నాడు. 90 ఎంఎల్ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో అత్తరు సాయిబు ఫైనల్ నెరేషన్ జరగాల్సి ఉంది. వీటికన్నా చాలా ముందు మొదలుపెట్టిన వాట్ ది ఫిష్ ఏవో కారణాల వల్ల ఆపేశారు కానీ త్వరలోనే రీ స్టార్ట్ చేస్తారట. మనోజ్ ఇదే స్పీడ్ కొనసాగిస్తే మంచిది.