బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి రోజు యాభై కోట్లకు దగ్గరగా గ్రాస్ వచ్చిందని ట్రేడ్ టాక్. అఫీషియల్ నెంబర్లు నిర్మాణ సంస్థ నుంచి ఇంకా రావాల్సి ఉంది. సీక్వెల్ కున్న క్రేజ్ కోణంలో చూసుకుంటే ఈ అంకెలు కొంచెం తక్కువగా అనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న మిక్స్డ్ టాక్ ప్రభావంతో పాటు రివ్యూలు యునానిమస్ గా లేకపోవడం కొంత ప్రభావమైతే చూపిస్తోంది. నిన్న ప్రెస్ మీట్ లో స్వయంగా నిర్మాతలే సినిమా మీద ఇండస్ట్రీ లోపల నెగటివిటీ ఉందని, బయట లేదని చెప్పిన తరుణంలో అసలు సవాల్ ఇకపై ఉంది.

శని ఆదివారాలు అఖండ 2 ఇదే ఊపును కొనసాగించాలి. అడ్వాన్స్ బుకింగ్ వేగం అదే సూచిస్తోంది కానీ సోమవారం కూడా ఈ ట్రెండ్ కొనసాగాలంటే ఇవాళ రేపు సినిమా చూసే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వాలి. అఖండ 1 చూసిన కళ్ళతో ఎక్కువ అంచనాలు పెంచేసుకున్న మూవీ లవర్స్ ని పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిన దర్శకుడు బోయపాటి శీను క్రమంగా ఇది పెద్ద రేంజుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో అభిమానుల సమక్షంలో సక్సెస్ ఈవెంట్లు చేయడం ద్వారా ఈ మూమెంట్ ఇలాగే కొనసాగించాలనే ప్లానింగ్ లో 14 రీల్స్ టీమ్ ఉంది.

రెండు, మూడో రోజు కనక అఖండ 2 సాలిడ్ కలెక్షన్లు రాబట్టగలిగితే రికవరీలో సగం దాకా పూర్తవ్వొచ్చు. అయితే బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే మాత్రం ఎక్కువ కష్టపడాలి. అఖండ మీద ఉన్న బ్రాండ్ ఇమేజ్ పుణ్యమాని ఇంత హైప్ రావడం సంతోషమే. కానీ సింహ, లెజెండ్, అఖండ తరహాలో అన్ని వర్గాల నుంచి ఒకే తరహా పాజిటివ్ స్పందన తెచ్చుకోలేకపోవడం అఖండ 2కి మైనస్ అవుతోంది. ఇప్పటికైతే స్ట్రాంగ్ గా ఉన్నాడు. పోటీలో పెద్దగా చెప్పుకునే సినిమాలు లేవు కానీ నగరాలు, పట్టణాల్లో దురంధర్ అనూహ్యంగా పికప్ కావడం ఒక్కటే కాంపిటీషన్ గా మారింది. ఇది మినహాయిస్తే అఖండ 2కి అపోజిషన్ లేదు.