ఏజ్ గ్యాప్… నో ప్రాబ్లం అంటున్న రకుల్

తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస ఫ్లాపుల వల్ల ఉన్నట్లుండి ఇక్కడ ఆమె కెరీర్ డౌన్ అయింది. అదే సమయంలో తన సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ కు వెళ్ళి సెటిల్ అయిపోయింది. అక్కడ వరుసగా సినిమాలు చేస్తుండగానే తన లాంగ్ టైం బాయ్‌ఫ్రెండ్, నిర్మాత రాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో తన జోరెమీ తగ్గలేదు. ఇప్పటికీ గ్లామర్ రోల్స్ కూడా కొనసాగిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన ‘దే దే ప్యార్ దే 2’లో రకుల్ సూపర్ సెక్సీగా కనిపించింది. ఈ చిత్రం ‘దే దే ప్యార్ దే’ లాగే బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయింది. ఈ చిత్రంలో అజయ్, రకుల్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. రకుల్ కంటే అజయ్ వయసు డబుల్ కావడం విశేషం.

సినిమాలో కథ పరంగా కూడా వీళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ ఉంటుంది. ఇలాంటి పాత్రలు చెయ్యడం, ఎక్కువ వయసున్న హీరోలతో నటించడం పట్ల తనకు అభ్యంతరాలేమీ లేవంటోంది రకుల్.

“దే దే ప్యార్ దే-2 పెద్ద సక్సెస్ అయింది. ఆ సినిమా మీద ప్రేక్షకులు అపారమైన ప్రేమ చూపించారు. భవిష్యత్తులోనూ నాకు ఇలాంటి పాత్రలు ఆఫర్ చేస్తే కచ్చితంగా చేస్తా. నిజ జీవితంలో నేను అలాంటి వయసు అంతరం ఉన్న జంటలను చాలానే చూశా. అలాంటి జంట కథతో తీయడం తేలిక కాదు. ఇలాంటి బంధాలను జనం అంగీకరిస్తారు అని మేం సినిమాలో చూపించలేదు. అందులో ఉండే ఇబ్బందులు, వాటి ప్రభావాన్నే చూపించాం.

ఇక అజయ్ గారితో నా కెమిస్ట్రీ విషయానికి వస్తే నటించిన తర్వాత అంతా వేరుగా ఉంటుంది. ఆయన నాకు ఎప్పుడూ సారే. కెమెరా ఆఫ్ అవ్వగానే మనలోని వేరే వ్యక్తి బయటికి వస్తారు. ఆ మార్పు ఎలా జరుగుతుందో కూడా తెలీదు. ఒక ఏడుపు సీన్ చెయ్యడానికి ముందు నిజానికి మేం నవ్వుతూ ఉంటాం. నటన వేరు, నిజ జీవితం వేరు. మనం ఒక యాక్షన్ మూవీ చూశామంటే వెంటనే వీధుల్లోకి వెళ్ళి గన్ను పట్టుకుని కాల్చం కదా. కొన్ని సినిమాలు వినోదం కోసమే చేస్తాం. కొన్ని మన మీద ప్రభావం చూపుతాయి” అని రకుల్ తెలిపింది.