గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమంలో ఆమె పాత్ర కీలకం. ఒక దశలో బాగా ఊపందుకున్న ఆ మూమెంట్.. తర్వాత నెమ్మదించింది. ఐతే మిగతా మహిళలు స్లో అయినా చిన్మయి మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. తనను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపిస్తున్న సీనియర్ లిరిసిస్ట్ వైరముత్తును టార్గెట్ చేస్తూనే ఉంది.
మరోవైపు అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల గురించి, అలాగే తన దృష్టికి వచ్చే లైంగిక వేధింపుల వ్యవహారాల గురించి ఆమె పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఐతే ఒక టైంలో ఆమె రామాయణం, రాముడి మీద నెగెటివ్ కామెంట్స్ చేయడంతో హిందుత్వ వాదులకు శత్రువుగా మారిపోయింది. కొన్ని వారాల కిందట మహిళలు మంగళసూత్రం ధరించే విషయం మీద ఇటు చిన్మయి, అటు ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.
ఇది ఎక్స్‌లో ఓ వర్గానికి రుచించలేదు. దీంతో చిన్మయిని వాళ్లు గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ‘ఎక్స్’లో తెలుగు కుర్రాళ్లతో చిన్మయి గొడవ ఈనాటిది కాదు. వాళ్లకిప్పుడు హిందుత్వ వాదులూ తోడయ్యారు. దీంతో తీవ్రత ఇంకా పెరిగింది. రోజూ వందల మంది చిన్మయిని బూతులు తిడుతున్నారు. వాళ్లలో కొందరికి ఆమె దీటుగా బదులిస్తోంది. ఐతే ఈ మధ్య స్పేస్‌లు పెట్టి మరీ అదే పనిగా చిన్మయిని తిట్టడం.. దాంతో పాటు ఆమె మీద మార్ఫ్స్ వేయడం కూడా చేస్తున్నారు.
ఒక అబ్యూజర్ పెట్టిన తన న్యూడ్ మార్ఫ్ గురించి ఆమె హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేయడమే కాక.. దాని గురించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ‘ఎక్స్’లో ఖాళీగా ఉండే, సంస్కారం లేని కుర్రాళ్లను తనను ఎలా టార్గెట్ చేస్తున్నారో.. వాళ్లకు డబ్బులిచ్చి ఒక వర్గం ఎలా అబ్యూజ్ చేయిస్తోందో ఆమె వివరించింది. ఇలాంటి వాటికి తాను అస్సలు చలించనని.. తనకు కుటుంబం కూడా మద్దతుగా ఉందని ఆమె వెల్లడించింది. ఏఐ కాలంలో అమ్మాయిలను వేధించడానికి ఈ మార్ఫ్స్‌ను ఉపయోగించుకుంటారని.. ఇలాంటి వాటికి భయపడకూడదని.. కుటుంబాలు కూడా సపోర్ట్ ఇవ్వాలని పిలుపునిచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates