అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ వయసులో ఉన్న చాలామంది కూడా ఆయన కంటే పెద్దవాళ్లలాగా కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాగ్.. దశాబ్దాలుగా క్రమబద్ధమైన వర్కవుట్స్, లైఫ్ స్టైల్‌తో వయసు ప్రభావం తన మీద పడకుండా చూసుకుంటున్నారు.
ఈ ఏడాది ‘కూలీ’ సినిమాలో నాగ్ లుక్, స్టైల్ చూసి తమిళ జనాలు వెర్రెత్తిపోయారు. ఈ తరం అబ్బాయిలు ఆయన స్టైల్‌ను అనుకరించాలని ప్రయత్నిస్తే.. అమ్మాయిలు నాగ్‌ను తమ క్రష్ లాగా ఫీలవుతూ వీడియోలు చేశారు. ‘కూలీ’ ప్రమోషన్లకు చెన్నై వెళ్లినపుడు అక్కడి సెలబ్రెటీలు, మీడియా వాళ్లు, యాంకర్లు కూడా నాగ్ లుక్ చూసి స్టన్ అయిపోయారు. తాజాగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. నాగ్‌కు అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు.
జియో హాట్ స్టార్ వాళ్లు చెన్నైలో చేసిన ఒక ఈవెంట్‌కు నాగ్, మోహన్ లాల్, సేతుపతి సహా చాలామంది సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ వేడుకలో మోహన్ లాల్ పక్కనుండగా.. స్టేజ్ మీద నాగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు సేతుపతి. తన చిన్నపుడు నాగ్‌ను చూస్తే ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారని, నాగ్‌కు అసలెందుకు వయసు పెరగట్లేదో తనకు అర్థం కావడం లేదని సేతుపతి అన్నాడు.
యాంటీ ఏజియింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు.. నాగ్‌ను నమూనాగా తీసుకుని కొన్ని రోజుల పాటు ఆయన మీద పరిశోధనలు చేయాలని అతను కోరాడు. నాగ్ జుట్టు కూడా ఎప్పట్నుంచో అలాగే ఉందని.. ఆయన ఎనర్జీ ఏమాత్రం తగ్గడం లేదని.. తనకు మనవళ్లు పుట్టి పెద్ద వాళ్లు అయినా కూడా నాగ్ ఇలాగే ఉంటారనిపిస్తోందని సేతుపతి అనడంతో ఆడిటోరియం హోరెత్తింది. ఈ పొగడ్తలకు నాగ్ పొంగిపోకుండా చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు. నాగ్ తెలుగులో ‘బిగ్ బాస్’కు చాలా సీజన్ల నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. ప్రస్తుతం తమిళంలో కమల్ హాసన్ స్థానంలో సేతుపతినే హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates