డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే రిలీజ్ చేసేస్తున్నారు. 12 సినిమాకు అఫీషియల్ రిలీజ్ డేట్ కాగా.. 11న రాత్రి సెకండ్ షోతో ప్రిమియర్స్ మొదలవుతున్నాయి. ఆ షోలు పడడానికి మధ్యలో ఒక్క రోజే గ్యాప్ ఉంది. కాబట్టి బుకింగ్స్ త్వరగా ఓపెన్ చేసేయాలి.
ఏపీలో అదనపు రేట్లు, బెనిఫిట్ షోల కోసం జీవో తెప్పించుకోవడంలో ఏం ఆలస్యం జరగలేదు. ఇలా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. అలా జీవో వచ్చేసింది. ముందే అప్లికేషన్ పెట్టుకుని అన్నీ చకచకా చేయించేసుకున్నారు. పాత జీవోనే డేట్లు మార్చి ఇచ్చారని స్పష్టమవుతోంది. రేట్లు, షోల విషయంలో ఏం తేడా లేదు. కానీ తెలంగాణ పరిస్థితి ఏంటన్నదే ఇంకా తేలలేదు.
గత వారం ‘అఖండ-2’ రిలీజ్ డేట్ కంటే మూడు రోజుల ముందే ఏపీ జీవో వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా జరిగాయి. కానీ నైజాం జీవో కోసం వెయిట్ చేసి చేసి అలసిపోయారు అందరూ. అది రావడంలో ఆలస్యం జరగడంతో ప్రిమియర్స్ డే మధ్యాహ్నం తర్వాత కూడా నైజాం బుకింగ్స్ మొదలు కాలేదు. ప్రిమియర్స్ అనే కాక మొత్తంగా బుకింగ్స్‌నే హోల్డ్ చేసి పెట్టారు. దాని వల్ల బుకింగ్స్ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి కనిపించింది. చివరికి సాయంత్రం 5 తర్వాత జీవో వచ్చింది. అప్పుడే ఫైనాన్స్ వివాదం ముదరడంతో బుకింగ్స్ ఎంతకీ మొదలు కాలేదు. చివరికి సినిమా వాయిదా పడిపోయింది.
ఇక వర్తమానంలోకి వస్తే.. రేపు రాత్రి సెకండ్ షోలతో ప్రిమియర్స్ మొదలవుతున్నాయంటే కనీసం ఒక రోజు ముందైనా బుకింగ్స్ మొదలు కావాలి. అంటే మరి కొన్ని గంటల్లో తెలంగాణ జీవో కూడా వచ్చేయాలి. ఏపీలో ఆల్రెడీ బుకింగ్స్ మొదలైపోయాయి. అవి జోరుమీదున్నాయి. ఈసారైనా ప్రభుత్వంలో గట్టిగా లాబీయింగ్ చేసి త్వరగా జీవో వచ్చేట్లు చూడాలని.. లేదంటే ప్రిమియర్స్ ఫుల్ కావడం కష్టమని.. మొత్తంగా బుకింగ్స్ మీద నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates