స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో బెంగళూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ కటకటాల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన కొత్త సినిమా డెవిల్ రేపు కర్ణాటక వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అయిదు కోట్ల గ్రాస్ రావడం చూసి ట్రేడ్ వర్గాలకు నోట మాట రావడం లేదు. ఎక్కడ చూసినా థియేటర్లను కల్యాణ మండపాల్లా అలంకరించడం చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. తమ సాటివాడిని చంపిన అభియోగం మోస్తున్నా సరే అతన్ని ఇంతలా ఆరాధించడం చూసి షాక్ తింటున్నారు.
సోషల్ మీడియాలో వీటి తాలూకు ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దర్శన్ సీనియర్ హీరోనే. ఎప్పటి నుంచో తెచ్చుకున్న ఫాలోయింగ్ ఉంది. అయినా సరే ఊచల వెనుక అతను ఎందుకు ఉండాల్సి వచ్చిందోనని గుర్తించకుండా డెవిల్ కి ఇంత ఘన స్వాగతం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. పైగా ఫలానా రికార్డులు ఫలానా చోట వచ్చేశాయంటూ గర్వంగా చెప్పుకోవడం ఇంకో ట్విస్టు. దర్శక నిర్మాతలు ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూ డెవిల్ కు వీలైనంత మైలేజ్ వచ్చేలా చేస్తున్నారు. ఫస్ట్ డే ఓపెనింగ్ నెంబర్స్ ఆశ్చర్యపోయే రీతిలో ఉండబోతున్నాయి.
నేరం ఇంకా ఋజువు కాకపోయినా సాక్ష్యాలు చాలా బలంగా ఉండటంతో దర్శన్ అంత సులభంగా బయటికి రాకపోవచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో ఇదేదో తన చివరి సినిమా అన్న రేంజ్ లో హడావిడి జరగడం నిజంగా వింతే. ఎవరైనా అభిమానులను దీని గురించి అడిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అయినా మా హీరో నిర్దోషిగా బయటికి వస్తాడని సినిమా రేంజ్ లో బిల్డప్ లు ఇస్తున్నారు. సాటి హీరోలు మాత్రం డెవిల్ విషయంలో పెదవి విప్పకుండా మౌనం వహిస్తున్నారు. శుభాకాంక్షలు చెప్పడం, వీడియో బైట్స్ లాంటివి ఇవ్వకుండా దూరంగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates