అర‌బిక్ భాష‌లో రామాయ‌ణం

రామాయ‌ణం నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇండియాలో బ‌హు భాష‌ల్లో అనేక సినిమాలు వచ్చాయి. కానీ ఆ క‌థ‌కు ఇప్ప‌టికీ డిమాండ్ త‌క్కువేమీ కాదు. ఇప్ప‌టి టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకుని ఈ క‌థ‌తో వెండితెర‌పై అద్భుతాలు చేయ‌డానికి అవ‌కాశ‌ముంది. కానీ ఆదిపురుష్ టీం ఆ ఛాన్స్‌ను వృథా చేసుకుంది. కానీ దంగ‌ల్ ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి చాలా ఏళ్ల నుంచి భారీ స్థాయిలో ఈ క‌థ‌ను తెర‌కెక్కించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. 

వేరే నిర్మాత‌ల చేతులు మారి చివ‌రికి న‌మిత్ మ‌ల్హోత్రా చేతికి వ‌చ్చాక ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. కొన్ని నెల‌ల ముందు వ‌ర‌కు ఇది మామూలు సినిమానే అనుకున్నారంతా. కానీ రామాయ‌ణం టీం షో రీల్ పేరుతో ఒక వీడియో రిలీజ్ చేశాక దీని రేంజే వేరని అర్థ‌మైంది.

అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మ‌రో లోకంలోకి తీసుకెళ్లింది ఆ గ్లింప్స్. ర‌ణ‌బీర్ క‌పూర్, సాయిప‌ల్ల‌వి, య‌శ్, స‌న్నీ డియోల్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తుండ‌డం.. ఏఆర్ రెహ‌మాన్‌తో క‌లిసి హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హ‌న్స్ జిమ్మ‌ర్ దీనికి సంగీతం స‌మ‌కూర్చ‌డం.. రామాయ‌ణం రెండు భాగాల‌కు క‌లిపి ఏకంగా రూ.4 వేల బ‌డ్జెట్ పెడుతున్న‌ట్లు నిర్మాత ప్ర‌క‌టించ‌డం ఈ సినిమాపై హైప్‌ను ఇంకా ఇంకా పెంచాయి. 

ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ముఖ్య దేశాల్లో, అనేక భాష‌ల్లో రిలీజ్ చేసి మ‌న రామాయ‌ణ గాథ గొప్ప‌ద‌నాన్ని ప్ర‌పంచానికి చాటాల‌ని.. భారీ వ‌సూళ్లూ రాబ‌ట్టాల‌ని టీం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఇందులో భాగంగా రామాయ‌ణం టీం ఒక సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకుంది. ఈ చిత్రాన్ని అర‌బిక్ భాష‌లోనూ రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించింది. అర‌బిక్ అంటే మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో ముస్లింల భాష‌. 

వాళ్లు హిందువులకు ఎంతో ప‌విత్రంగా భావించే పురాణ గాథ‌ రామాయ‌ణం మీద తెర‌కెక్కే సినిమా చూసేందుకు ఏమాత్రం ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కం. కానీ రామాయ‌ణ గాథ‌ను ప్ర‌పంచానికి చూపించాల‌ని కృత‌నిశ్చ‌యంతో ఉన్న చిత్ర భృందం అనేక విదేశీ భాష‌ల‌కు తోడు అరబిక్‌లోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఆ భాష‌లో గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేసింది. మ‌రి అరబిక్‌లో ఈ సినిమాకు ఎలాంటి ఆద‌ర‌ణ ద‌క్కుతుందో చూడాలి.