ముందు జాగ్రత్త పడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్

ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో త్వరలోనే పలకరించబోతున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు నిరాశపరిచినప్పటికీ ఓజి పెద్ద ఊరట కలిగించింది. ఫ్యాన్స్ కోరుకుంటున్న రికార్డులను బంగారు పళ్లెంలో పెట్టిచ్చింది. అయినా సరే ఇంకేదో కావాలనే ఆకలి వాళ్లలో ఉన్న మాట వాస్తవం. అది దర్శకుడు హరీష్ శంకర్ తన ఉస్తాద్ భగత్ సింగ్ తో తీరుస్తాడనే నమ్మకం మెల్లగా బలపడుతోంది. చిన్న డాన్స్ ప్రోమోతోనే ఒక్కసారిగా అటెన్షన్ తన వైపు వచ్చేలా చేసుకున్న పవన్ 13న ఫుల్ సాంగ్ తో ఇంకెంత రచ్చ చేస్తాడో చూడాలి.

ఇదిలా ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పెద్ది, ది ప్యారడైజ్ వచ్చే అవకాశం డౌట్ గా ఉన్న కారణంగా ఆ ప్లేస్ లో మార్చి 26 పవర్ స్టార్ వస్తాడని వాటి సారాంశం. దీనికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఒకటి మాత్రం నిజం. ఉస్తాద్ రిజర్వ్ ప్లాన్ లో అయితే ఉన్నాడు. ఒకవేళ పెద్ది కనక ఏదైనా అనివార్య కారణాల వల్ల రాలేని పక్షంలో వెంటనే భగత్ సింగ్ రంగంలోకి దిగుతాడు.ఈ సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ పెద్దిలోనూ నిర్మాణ భాగస్వామి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ రెండింటిలో ఒకటే వస్తుంది.

అటు దర్శకుడు బుచ్చిబాబు వాయిదా వేయనిచ్చే ప్రసక్తే లేదనే తరహాలో షూట్ వేగవంతం చేశాడు. ఇండిగో ఫ్లైట్స్ గొడవ వల్ల ఒక షెడ్యూల్ పోస్టు పోన్ చేయాల్సి వచ్చినా దాని వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఏమేం చేయాలనే దాని మీద టీమ్ తో కలిసి కసరత్తు చేస్తున్నాడు. అందుకే జనవరి చివరి దాకా దీనికి సంబంధించి క్లారిటీ రాకపోవచ్చు. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. ప్రస్తుతానికి పెద్దిలో ఎలాంటి మార్పు లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఏ టైంలో ఎలా మాట మిస్ అవుతారో చెప్పలేం కాబట్టి జరిగే దాకా వేచి చూడాల్సిందే.