జయశ్రీగా తమన్నా… ఎవరు ఈవిడ ?

స్పెషల్ సాంగ్స్ లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా చాలా గ్యాప్ తర్వాత ఛాలెంజింగ్ రోల్ ఒకటి దక్కించుకుంది. భారతీయ సినిమాకు తొలిపునాదులు వేసిన మహనుభావుల్లో ఒకరిగా చెప్పుకునే దర్శక నిర్మాత వి శాంతారాం బయోపిక్ లో తమన్నా ఆయన భార్య జయశ్రీ పాత్రలో కనిపించనుంది. అలాని ఇదేదో రెగ్యులర్ తరహాలో ఉండదు. అదేంటో తెలియాలంటే కొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళాలి. 1920లో ఇండస్ట్రీకి వచ్చిన శాంతారాం ఆ తర్వాత ఏడేళ్లకే ప్రభాత్ ఫిలిం కంపెనీ స్థాపించి నిర్మాణాలు మొదలుపెట్టారు. 1937లో రిలీజైన సంత్ తుకారాం గొప్ప విజయం సాధించి ఆయన ఖ్యాతికి తొలిమెట్టుగా నిలిచింది.

1942లో రాజ్ కమల్ కళా మందిర్ స్థాపించాక ఎన్నో గొప్ప క్లాసిక్స్ ఇచ్చారు శాంతారాం. సమాజానికి ఉపయోగపడే, ఆలోచింపజేసే ఫిలిం మేకర్ గా దేశవిదేశాల్లో శాంతారాం గురించి గొప్పగా చెప్పుకునేవారు. దొ ఆంఖే బారా హాత్, అమర్ భూపాలీ, ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్, పడోసి ఆయన అందించిన ఆణిముత్యాల్లో కొన్ని. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. శాంతారాం మొదటి వివాహం విమలాబాయ్ తో జరిగింది. ఈ జంటకు నలుగురు సంతానం. తమన్నా పోషిస్తున్న జయశ్రీని తన రెండో భార్య. 1941లో పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు పిల్లలు. 1956లో విడాకులు తీసుకున్నారు.

జయశ్రీ అప్పట్లో టాప్ హీరోయిన్. శాకుంతల, చంద్రరావు మోరే, దహేజ్, డాక్టర్ కోట్నీస్ కి అమర్ కహాని లాంటి సూపర్ హిట్స్ ఆవిడ ఫాలోయింగ్  అమాంతం పెంచేశాయి. శాంతారాంతో పరిచయం, ప్రేమ, పెళ్లి కథ ఏ సినిమాకు తీసిపోని స్థాయిలో ఉంటాయి. జయశ్రీతో విడాకులు తీసుకున్నాక 1956లో సంధ్యని మూడో పెళ్లి చేసుకున్నారు శాంతారాం.. ఇద్దరి మధ్య వయసు గ్యాప్ 37 ఏళ్ళు. అప్పట్లో ఇది సంచలనం రేపింది. మన మహానటి ఛాయలు కనిపిస్తున్నాయి కదూ. ఎంత లెజెండరీ డైరెక్టర్ అయినా పర్సనల్ లైఫ్ లో ఇలాంటివి కూడా ఉంటాయి మరి. తమన్నా పెర్ఫార్మన్స్ పరంగా బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.