ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు శ్రీను వైట్ల. పెద్ద స్టార్లతోనూ కామెడీ చేయించొచ్చని.. తద్వారా భారీ విజయాలు అందుకోవచ్చని రుజువు చేసిన దర్శకుడాయన. ముఖ్యంగా కింగ్, దూకుడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సాధించిన విజయాలు చూశాక టాలీవుడ్ టాప్ స్టార్లు అందరికీ వైట్లతో ఒక సినిమా చేయాలనే ఆశ కలిగిందంటే అతిశయోక్తి కాదు.
ఐతే ‘దూకుడు’తో కెరీర్ పతాక స్థాయిని అందుకున్న వైట్లకు తర్వాత విజయం ఎండమావే అయింది. ‘బాద్ షా’ ఓ మాదిరిగా ఆడింది కానీ.. ఆపై వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్లే. ఆగడు, బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలతో తన కెరీర్ పూర్తిగా తిరగబడింది. చాలా గ్యాప్ తర్వాత గత ఏడాది ‘విశ్వం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వైట్ల. ఈసారి కూడా రిజల్ట్ మారలేదు. దీంతో మళ్లీ కొత్త సినిమాకు గ్యాప్ తప్పట్లేదు.
ఐతే శ్రీను వైట్ల ఇంతటితో తన ప్రయత్నాన్నేమీ ఆపట్లేదు అంటున్నాడు ఆయనకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత అనిల్ సుంకర. వైట్లతో నమో వెంకటేశ, దూకుడు, ఆగడు చిత్రాలను నిర్మించిన ప్రొడ్యూసర్లలో అనిల్ ఒకరు. 90వ దశకం నుంచే వైట్లతో అనిల్‌కు పరిచయం ఉందట. అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటున్న తాను సినీ రంగంలోకి రావడానికి కారణం వైట్లనే అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అనిల్.
కెరీర్ ఆరంభం నుంచి దాదాపుగా ప్రతి కథనూ తనతో షేర్ చేసుకునేవాడని.. ఇప్పటికీ అదే జరుగుతోందని ఆయన తెలిపాడు. వైట్ల తన కొత్త సినిమా కోసం కథ రెడీ చేశాడని.. అది మామూలుగా ఉండదని అనిల్ అన్నాడు. శ్రీనుకు ఇది కమ్ బ్యాక్ మూవీ అని.. ఈ మాటను అందరూ ఒప్పుకుంటారని.. వంద శాతం అతను హిట్ కొట్టబోతున్నాడని అనిల్ ధీమా వ్యక్తం చేశాడు. ఐతే సినిమా గురించి ఇంకే వివరాలూ ఆయన చెప్పలేదు.
ఇక తాను గతంలో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటతో కలిసి సినిమాలు చేసిన ‘14 రీల్స్’ నుంచి బయటికి రావడం గురించి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడాడు అనిల్. 14 రీల్స్‌లో తాము ముగ్గురం కలిసి పెద్ద సినిమాలు తీసేవాళ్లమని.. తాను ఏకే ఎంటర్టైన్మెంట్స్‌లో చిన్న చిత్రాలు చేసేవాడినని.. ఐతే 14 రీల్స్‌లో రామ్, గోపి చిన్న మిడ్ రేంజ్ సినిమాలు చేయాలనుకున్నారని.. అందుకే తాను వేరు అయ్యానని.. అంతే తప్ప తమ మధ్య గొడవలేమీ లేవని.. ఇప్పటికీ తన బేనర్ కథలు వాళ్లకు, వాళ్ల కథలు తనకు చెబుతూ ఉంటారని.. రామ్ మంచి జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి అని అనిల్ వ్యాఖ్యానించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates