కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత కష్టం తర్వాత అతను కొంచెం రిలాక్స్ అయిపోయాడని తర్వాతి చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో ప్రభాస్ లుక్ ఏమంత ఆకర్షణీయంగా కనిపించలేదు. బయట కూడా యావరేజ్‌ లుక్‌తోనే దర్శనమిచ్చాడు రెబల్ స్టార్. ఐతే తన లుక్ మీద విమర్శలు రావడంతో తర్వాత ప్రభాస్ జాగ్రత్త పడ్డాడు. 

సలార్, కల్కి చిత్రాల్లో చాలా మెరుగ్గా కనిపించాడు. ఇక హను రాఘవపూడితో చేస్తున్న సినిమాకు ప్రభాస్ లుక్ ఇంకా బెటర్ అయింది. ఇప్పుడిక ప్రభాస్ చేయబోయేది చాలా స్పెషల్ మూవీ. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ షూట్ మొదలైంది. త్వరలోనే ప్రభాస్ సెట్స్‌లో అడుగు పెట్టబోతున్నాడు.

ఈ సినిమాలో ప్రభాస్ బెస్ట్ లుక్‌లో కనిపిస్తాడని.. ఇందుకోసం అవతారం మార్చేస్తున్నాడని.. కొత్త లుక్‌లోకి మారాక ఆరు నెలల పాటు బయట కనిపించడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే పూర్తి మేకోవర్ అయ్యేలోపే.. మధ్యలో ప్రభాస్ బయటికి రావాల్సిన పరిస్థితి తలెత్తింది. ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రమోషన్ కోసం ప్రభాస్ జపాన్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. అందులో ప్రభాస్ చాలా సన్నగా కనిపించాడు. 

రెబల్ స్టార్ ఇలాంటి లీన్ లుక్‌లో కనిపించి చాలా ఏళ్లయింది. ‘బాహుబలి’ కంటే ముందు ‘మిర్చి’ చేస్తున్నపుడు ఇంత సన్నగా కనిపించాడు. ఎంతో ఎఫర్ట్ పెడితే తప్ప ఆ అవతారంలోకి మారడం కష్టం అనుకున్నారందరూ. కానీ సందీప్ సినిమా అంటే చాలా స్పెషల్, పైగా అందులో చేయబోతోంది పోలీస్ పాత్ర కావడంతో ప్రభాస్ మారక తప్పలేదు. ఐతే మనిషి సన్నబడినా.. ముఖంలో ఏమీ కళ పోలేదు. ఛార్మ్‌తోనే కనిపించాడు ప్రభాస్. ఇంకొన్ని రోజులు ఎఫర్ట్ పెడితే రెబల్ స్టార్ ఇంకా మంచి లుక్‌లోకి మారి ‘స్పిరిట్’లో ది బెస్ట్ లుక్‌లో కనిపిస్తాడనడంలో సందేహం లేదు.