హీరోయిన్ సీన్లు క‌ట్ చేయించిన హీరో

హ‌నుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ స‌జ్జా. ఐతే ఈ రెండు చిత్రాల‌కు ముందు తేజ‌.. చిన్న చిన్న సినిమాలే చేశాడు. కెరీర్ ఆరంభంలో అత‌ను అద్భుతం అనే సినిమా చేసిన సంగ‌తి చాలామందికి గుర్తుండ‌క‌పోవ‌చ్చు. క‌రోనా టైంలో ఓటీటీలో నేరుగా విడుద‌లై ఓ మోస్త‌రు స్పంద‌న తెచ్చుకుందా సినిమా. అది ఒక కొరియ‌న్ మూవీకి ఫ్రీమేక్.

మ‌ల్లిక్ రామ్ రూపొందించాడు. ఆ సినిమా విడుద‌ల‌కు ముందు ఫిలిం చాంబ‌ర్‌లో ఒక వివాదం న‌డిచిన సంగ‌తి ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు తెలుసు. దాని గురించి ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత మోగుళ్ళ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి విలేక‌రుల స‌మావేశంలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్లడించారు. తేజ స‌జ్జ పేరు చెప్ప‌కుడా.. ఆ సినిమా నుంచి హీరో, ఎడిట‌ర్ క‌లిసి 15 నిమిషాల‌కు పైగా నిడివి ఉన్న సీన్లు తీయించేశార‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం.

త‌న నిర్మాణంలో రాబోతున్న కొత్త చిత్రం గోట్ ప్రెస్ మీట్లో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఈ విష‌యం బ‌య‌ట‌పెట్టారు. త‌న ప్రొడ‌క్ష‌న్లో వ‌చ్చిన తొలి రెండు చిత్రాల్లో హీరో వేలు పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. తొలి సినిమాను క‌రోనా వ‌ల్ల‌ ఓటీటీలో రిలీజ్ చేశామ‌ని.. ఆ సినిమాకు ఫైన‌ల్ ర‌న్ టైం 2 గంట‌ల 21 నిమిషాల‌ని ఆయ‌న చెప్పారు. అక్క‌డి లాక్ చేసి రీ రికార్డింగ్‌కు పంపితే.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ద‌న్ ఫోన్ చేసి ర‌న్ టైం 2 గంట‌ల 4 నిమిషాలే ఉంద‌ని చెప్ప‌డంతో తాను షాకైన‌ట్లు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి తెలిపారు. త‌ర్వాత విష‌యం ఏంటా అని ఆరా తీస్తే.. హీరో, ఎడిట‌ర్ క‌లిసి హీరోయిన్ సీన్లు 15 నిమిషాల‌కు పైగా లేపేశార‌ని తెలిసింద‌న్నారు. త‌న మీద హీఓయిన్ డామినేష‌న్ ఉంద‌నే ఉద్దేశంతో హీరో అలా చేశాడ‌న్నారు. ఇది త‌న కూతురి సినిమా కావ‌డంతో జీవిత రాజ‌శేఖ‌ర్ సీరియ‌స్ అయ్యార‌ని.. ఈ ఇష్యూను ఫిలిం ఛాంబ‌ర్ వ‌ర‌కు తీసుకెళ్లార‌ని.. ఇందులో త‌న ప్ర‌మేయం ఏమీ లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇక గోట్ మూవీ ప్రమోషన్లకు హీరో సుడిగాలి సుధీర్ రాకపోవడం గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ..డైరెక్షన్ టీంతో ఆయనకు సమస్యలు ఉన్నాయని.. సుధీర్ అడిగిన బడ్జెట్ ఇచ్చి సినిమా పూర్తి చేయించమని.. ప్రమోషన్లకు రావాలని మీడియా ద్వారా ఆయన్ని కోరుతున్నామని చంద్రశేఖర్ అన్నారు.