బాసుతో బోస్… రాంబాయి ఇచ్చిన ‘మెగా’ ఛాన్స్!

రాజు వెడ్స్ రాంబాయి.. టాలీవుడ్లో ఈ సినిమా కొత్త సంచలనం. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను అందించిన ఈటీవీ విన్ వాళ్లే దర్శకుడు వేణు ఉడుగులతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ను రిలీజ్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని కూడా తమ బేనర్ల నుంచి విడుదల చేశారు. కొత్త హీరో హీరోయిన్లు, కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమా అయినా.. ఇది ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది.

ఇప్పటికే వసూళ్లు రూ.10 కోట్లను చేరుతున్నాయి. ఈ సినిమా స్థాయికి అది పెద్ద నంబరే. ‘రాజు వెడ్స్ రాంబాయి’లో భాగమైన అందరికీ మంచి మంచి అవకాశాలే వస్తాయనడంలో సందేహం లేదు. ఈ సినిమా సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ బాబీ.. తన వంతుగా ఇద్దరికి ఛాన్స్‌లు కూడా ఇచ్చేశాడు. ఆ ఇద్దరే.. దర్శకుడు సాయిలు, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్.

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సాయిలు స్పీచ్ విని తాను కదిలిపోయినట్లు బాబీ చెప్పాడు. సాయిలు మాటలు విని తనకు వణుకు పుట్టిందని.. నిజాయితీగా ఉండేవాళ్లు ఇలానే ఉంటారని అనిపించిందని బాబీ చెప్పాడు. ఈ సినిమా చూశాక తనకు కూడా నిర్మాతగా మారాలనిపించిందని తెలిపాడు. ఇక స్టేజ్ మీదే సాయిలును పిలిచి.. చిరంజీవి హీరోగా తాను తీయబోయే సినిమాలో నువ్వొక పాత్ర చేయాలి అని బాబీ అడగ్గా.. అంతకంటే భాగ్యమా అన్నట్లు సరే అన్నాడు సాయిలు. 

మరోవైపు మిట్టపల్లి సురేందర్ రాసిన ‘రాంబాయి నీ మీద నాకు..’ పాటను కొనియాడిన బాబీ.. చిరు చిత్రంలో అతడికి ఒక పాట రాసే అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. దీంతో అతనూ అమితానందానికి గురయ్యాడు. మొత్తానికి ఓ చిన్న సినిమాతో తమ ప్రతిభను చాటిన సాయిలు, మిట్టపల్లి సురేందర్.. ఏకంగా చిరు సినిమాలోనే అవకాశాలు అందుకోబోతున్నారన్నమాట.