రెండేళ్లలో 6 లక్షల నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ ?

మొన్న ఏడాది తమిళంలో విడుదలైన పార్కింగ్ ఎంత పెద్ద హిట్టో కోలీవుడ్ మీద ఐడియా ఉన్న వాళ్లకు తెలిసే ఉంటుంది. మన దగ్గర థియేటర్ రిలీజ్ జరగలేదు కానీ తెలుగు డబ్బింగ్ హాట్ స్టార్ లో చూసి మెచ్చుకున్న టాలీవుడ్ ఆడియన్స్ భారీగా ఉన్నారు. అద్దె ఇంట్లో పార్కింగ్ స్థలం విషయమై ఒక వయసు మళ్ళిన ప్రభుత్వ ఉద్యోగికి, కొత్తగా పెళ్ళైన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి మధ్య జరిగే ఈగో యుద్ధంని చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు జాతీయ అవార్డులు సాధించడంతో పార్కింగ్ దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు సౌత్ లో గట్టిగా వినిపించింది.

చెన్నై టాక్ ప్రకారం పార్కింగ్ తీసినందుకు గాను బాలకృష్ణన్ అందుకున్న పారితోషికం కేవలం 6 లక్షలు. ఇప్పుడు శింబూతో ఒక మూవీ చేస్తున్నాడు. దాని రెమ్యునరేషన్ 2 కోట్లు. ఇది షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. కమల్ హాసన్ స్వంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ నిర్మించే ఈ భారీ చిత్రాన్ని సుందర్ సి వదిలేసుకున్న తర్వాత ఈ బంగారం లాంటి అవకాశం బాలకృష్ణన్ ను వరించిందని కోలీవుడ్ రిపోర్ట్. ఇప్పుడీ ప్యాన్ ఇండియా మూవీకి ఏకంగా 10 కోట్లు అందుకోవచ్చని అంటున్నారు. అంటే 6 లక్షల నుంచి 10 కోట్లు కేవలం రెండు సంవత్సరాల కాలంలో.

దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. సుందర్ సి వెళ్ళిపోయాక కమల్ హాసన్ తొందరపడటం లేదు. రజనీకాంత్ ఫుల్ వెర్షన్ విని ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక అప్పుడు ప్రకటన ఇవ్వబోతున్నారు. ఇంతకు ముందు తొందరపడి వీడియో ప్రోమో వదలడం అనవసరంగా పుకార్లకు తెరతీసింది. ఈసారి అలాంటి అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటిదాకా బాలకృష్ణన్ తానుగా ఈ విషయం గురించి బయట పడలేదు. ప్రొడక్షన్ హౌస్ చెబితే తప్ప నోరు విప్పలేడు. సో అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు. ఇంత యంగ్ డైరెక్టర్ తో రజని ఎలాంటి బ్రేక్ అందుకుంటారో చూడాలి.