దేవర-2 గురించి మళ్లీ రచ్చ

గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘దేవర’ మూవీ. రిలీజ్ ముంగిట ఈ సినిమా చుట్టూ కొంచెం నెగెటివిటీ ముసురుకున్నా.. విడుదల తర్వాత కూడా టాక్ కాస్త మిక్స్డ్‌గా వచ్చినా.. అన్నింటినీ తట్టుకుని నిలబడింది ‘దేవర’. ఈ సినిమాను రెండు భాగాలుగా తీయబోతున్నట్లు టీం ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఐతే ఫస్ట్ పార్ట్‌కు మొదట్లో వచ్చిన టాక్ చూస్తే సీక్వెల్ కష్టమనే చర్చ జరిగింది. తర్వాత సీక్వెల్ ఉంటుందన్న సంకేతాలు వచ్చాయి. కానీ గత ఏడాది కాలంలో ‘దేవర’ సీక్వెల్ ఉంటుందా లేదా అంటూ అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. ఒక దశలో సీక్వెల్ అటకెక్కేసిందని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ ‘దేవర’ వార్షికోత్సవ సమయంలో మళ్లీ సీక్వెల్ పట్టాలెక్కబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ ‘దేవర-2’ గురించి నెగెటివ్ వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌కు ఉన్న కమిట్మెంట్లు.. దేవర-2 ఏ మేర వర్కవుట్ అవుతుందన్న సందేహాలు.. అన్నీ చూసుకుని ఈ సినిమాను పక్కన పెట్టేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ ఆ సినిమాపై ఆశలు వదులుకుని వేరే ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడం మీద దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా హీరో ఎన్టీఆర్‌కే సీక్వెల్ మీద అంతగా ఆసక్తి లేదని అంటున్నారు. తారక్ అభిమానుల్లోనూ ఒక వర్గం దేవర-2 పట్ల నెగెటివ్‌గానే స్పందిస్తోంది. ఆ సినిమా చేయాల్సిన అవసరం లేదని ఆ వర్గం అంటోంది. 

కానీ ఇంకో వర్గం మాత్రం ‘దేవర’ సీక్వెల్ చేస్తే బాగుంటుందని అంటోంది. కొందరు పనిగట్టుకుని ‘దేవర-2’ గురించి నెగెటివ్ వార్తలు సృష్టిస్తున్నారని వాళ్లు మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ.. ‘దేవర-2’ ముందుకు సాగడం మీద అనుమానాలు పెరుగుతున్న మాట మాత్రం వాస్తవం. మేకర్స్ ఈ ప్రచారాన్ని ఖండించకపోతే ఆ సినిమా ఉండదనే నిర్ణయానికి అందరూ వచ్చేస్తారు.