ప్రభాస్ టైటిల్.. అర్థమేంటి?

సలార్.. సలార్.. సలార్.. నిన్న మధ్యాహ్నం నుంచి ఎక్కడ చూసినా ఈ మాటే వినిపిస్తోంది. ఇది ప్రభాస్ కొత్త సినిమా టైటిల్. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలె ఫిలిమ్స్ (కేజీఎఫ్ నిర్మాణ సంస్థ) నిర్మించబోయే చిత్రమిది. బుధవారం మధ్యాహ్నం ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లాంచ్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులకు పెద్ద సర్ప్రైజే.

కొన్ని రోజుల ముందు వరకు ప్రభాస్-ప్రశాంత్ కాంబినేషన్ గురించి అసలు సమాచారమే లేదు. కానీ ఉన్నట్లుండి సినిమా ప్రకటించేశారు. టైటిల్, ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేసేశారు. జనవరి నుంచే షూటింగ్ అని కూడా అంటున్నారు. దీంతో సినీ వర్గాల్లో ఈ సినిమా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా దీని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.

ఇక ఈ చర్చల్లో భాగంగా టైటిల్ గురించి కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. అసలు ‘సలార్’ అంటే ఏంటి అని శోధించడం కూడా మొదలుపెట్టారు. సలార్ అనేది ఉర్దూ పదం. ముస్లిమ్స్‌లో మగవాళ్లు పెట్టుకునే పేరు. దీనికి నాయకుడు, దారి చూపేవాడు అనే అర్థాలున్నాయి. దీన్ని బట్టి సినిమా మీద ఒక ఐడియాకు రావచ్చు. పవర్ ఫుల్ సౌండింగ్‌తో ఉన్న టైటిల్ ఈజీగా జనాల్లోకి వెళ్లిపోతుంది.

ఐతే ఈ టైటిల్ పెట్టారంటే సినిమాలో ప్రభాస్ ముస్లింగా కనిపించబోతున్నాడా అన్నది ఆసక్తికరం. అదే నిజమైతే ఇదొక సాహసోపేత ప్రయత్నంగానే భావించాలి. మన స్టార్లు ముస్లిం పాత్రలు పోషించడం అత్యంత అరుదు. బాలీవుడ్లో హీరోలకు ఇది అలవాటే కానీ.. సౌత్ హీరోలు ఆ టైపు పాత్రలు పెద్దగా చేయరు. ఆ సంగతలా వదిలేస్తే ‘సలార్’ లీడ్ రోల్ కోసం ప్రభాస్ మేకోవర్ మాత్రం అదిరిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతడి మీసం, హేర్ స్టైల్, ఓవరాల్ లుక్ అదుర్స్ అంటున్నారు. ‘అత్యంత హింసాత్మకమైన వ్యక్తులు అత్యంత హింసాత్మకమైన వ్యక్తిగా పిలిచే హీరోకు ఇచ్చిన ఎలివేషన్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.