కృష్ణ కోసం చేశారు… మరి మహేష్ కోసం?

సుమారు నలభై సంవత్సరాల క్రితం సింహాసనం విడుదలైనప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైన థియేటర్లు రీ మాడలింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ మొదటిసారి టాలీవుడ్ లో 70 ఎంఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ తో తొలి సినిమా తీశారు కాబట్టి, దానికి అనుగుణంగా ఉండేందుకు బోలెడు ఖర్చు అయినా సరే ఎగ్జిబిటర్లు రిస్క్ తీసుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ సింహాసనం బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత కృష్ణ చూపించిన దారిలో ఇతర నిర్మాతలు వెళ్లి అదే టెక్నాలజీతో తీయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి కారణం మహేష్ బాబు వారణాసి.

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ టాపిక్ మీద డిస్కషన్ జరుగుతోంది. రాజమౌళి ఈ ప్యాన్ ఇండియా మూవీని కంప్లీట్ ఐమ్యాక్స్ లో తీస్తున్నామని ప్రకటించగానే ఒక్కసారిగా మూవీ లవర్స్ హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. అయితే ఇక్కడో సాడ్ న్యూస్ ఉంది. ఇండియాలో పరిమిత సంఖ్యలో ఐమాక్స్ తెరలు ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ఒక్కటి కూడా లేదు. కోకా పేటలో అల్లు ఫ్యామిలీ నిర్మిస్తున్న మల్టీప్లెక్సులో రావొచ్చని అంటున్నారు కానీ నిర్ధారణగా తెలియదు. క్రాస్ రోడ్స్ లో రావొచ్చనే ప్రచారం జరిగినా అందులో నిజం లేదని తర్వాత క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చేతిలో సుమారు రెండేళ్ల సమయముంది.

ఈలోగా వారణాసి కోసం ఏవైనా థియేటర్లు, మల్టీప్లెక్సులు ఐమాక్స్ గా మారతాయా అంటే వెంటనే సమాధానం దొరకడం లేదు. ఒకవేళ చేయాలి అనుకుంటే ప్లానింగ్ ఇప్పటి నుంచే ఉండాలి. అప్పట్లో కృష్ణ సినిమా కోసం ఇలాంటి విప్లవాత్మక మార్పు వచ్చినప్పుడు, మహేష్ మూవీ కోసం కూడా రావాలనేది ఘట్టమనేని ఫ్యాన్స్ కోరిక. ఎంతమేరకు నెరవేరుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి. ప్రధాన నగరాల్లో కాకపోయినా కనీసం హైదరాబాద్ లో రెండు మూడు ఐమాక్స్ లు ఉండాలని సినీ ప్రియులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మరి వాళ్ళ ఆకాంక్ష ఏ మేరకు నెరవేరుతుందో ఇంకొంత కాలం ఆగి చూడాలి.