వారణాసి విలన్ వెనుక ఏంటి స్టోరీ?

ఎట్ట‌కేల‌కు మ‌హేష్ బాబు, రాజ‌మౌళి సినిమా పేరేంటో తెలిసిపోయింది. కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉన్న‌ వార‌ణాసి అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్‌నే సినిమాకు ఖ‌రారు చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ను కూడా ప‌రిచ‌యం చేస్తూ టీం రిలీజ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాను ఊపేసింది. ఇక మ‌హేష్ బాబు ఫ‌స్ట్ లుక్‌కు కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. అంత‌కుముందు హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫ‌స్ట్ లుక్ కూడా పాజిటివ్ రెస్పాన్సే తెచ్చుకుంది. కానీ వార‌ణాసి టీం రిలీజ్ చేసిన ఫ‌స్ట్ పోస్టర్ మాత్రం మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకుంది.

కుంభా అనే పాత్ర‌లో పృథ్వీరాజ్ లుక్ సాధార‌ణంగా ఉంద‌ని.. పైగా వేరే పోస్ట‌ర్లకు అది కాపీ అని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మామూలుగా రాజ‌మౌళి విల‌న్లంటే చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. వాటితో మ్యాచ్ చేసేలా ఈ పాత్ర క‌నిపించ‌డ‌డం లేద‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి. కానీ ఇంత భారీ చిత్రంలో రాజ‌మౌళి త‌న‌ విల‌న్ పాత్ర‌ను అంతా ఆషామాషీగా తీర్చిదిద్ది ఉంటాడ‌నుకుంటే పొర‌పాటే. కుంభా వెనుక ఇప్పుడు వినిపిస్తున్న థియ‌రీ చూస్తే.. ఈ పాత్ర చాలా ప్ర‌త్యేకంగానే ఉంటుంద‌నే అంచ‌నాలు క‌లుగుతున్నాయి.

రాజ‌మౌళి త‌న విల‌న్ పాత్ర‌కు కుంభా అని పేరు పెట్ట‌డానికి ప్ర‌త్యేక కార‌ణ‌మే ఉందంటున్నారు. రామాయ‌ణంలో ఎంతో ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల్లో ఒక‌టైన కుంభ‌క‌ర్ణుడి పాత్ర స్ఫూర్తితో దీన్ని తీర్చిదిద్దిన‌ట్లు చెబుతున్నారు. ఆరు నెల‌లు నిద్ర‌పోయి.. ఆరు నెల‌లు మేల్కొని ఉండే కుంభ‌క‌ర్ణుడి పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. రావ‌ణాసురుడితో యుద్ధానికి ముందు రాముడికి.. కుంభ‌క‌ర్ణుడు స‌వాలుగా నిలుస్తాడు. రాముడు అత‌డి చేతిని, అలాగే రెండు కాళ్ల‌ను న‌రుకుతాడు.

ఇప్పుడు పృథ్వీరాజ్ ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. అత‌ను చేతులు కాళ్లు చ‌చ్చుబ‌డి చ‌క్రాల కుర్చీకి ప‌రిమిత‌మైన‌ట్లు చూపించారు. పైగా ఈ పాత్ర‌కు కుంభా అనే పేరు పెట్టారు. దీన్ని బ‌ట్టి ఇది కుంభ‌క‌ర్ణుడి రెఫ‌రెన్స్‌తో తీర్చిదిద్దిన పాత్ర అని అర్థ‌మ‌వుతోంది. ఈ క‌థ‌కు రామాయ‌ణంతో లింక్ ఉంద‌ని.. మ‌హేష్ బాబు ఇందులో రాముడిగా క‌నిపిస్తాడని రాజ‌మౌళి స్వ‌యంగా వెల్ల‌డించాడు. కాబ‌ట్టి పృథ్వీరాజ్ పాత్ర‌కు స్ఫూర్తి కుంభ‌క‌ర్ణుడి క్యారెక్ట‌రే అని భావించ‌వ‌చ్చు. సినిమాలోనూ ఈ రెండు పాత్ర‌ల‌కు లింక్ ఉన్న‌ట్లుగా చూపించే అవ‌కాశ‌ముంది.