ఓ కన్నడ సినిమా ఆ భాషలోనే కాక తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కడం.. అన్ని చోట్లా ఒకేసారి విడుదల కావడమే ఆశ్చర్యమంటే అన్ని చోట్లా అద్భుత విజయం సాధించడం అసామాన్యమైన విషయం. రెండేళ్ల కిందట కేజీఎఫ్ ఈ అద్భుతమే చేసింది. ఆ సినిమా ప్రోమోలు చూసినపుడు చాలామందికి తెలుగు బ్లాక్‌బస్టర్ ఛత్రపతినే గుర్తుకు వచ్చింది. సినిమా చూస్తున్నపుడు కూడా ఆ సినిమా ఛాయలు అక్కడక్కడా కనిపించాయి.
యశ్ రాకీ పాత్రలో ఎంత బాగా చేసినప్పటికీ.. ఆ స్థానంలో ప్రభాస్ ఉంటే సినిమా రేంజే వేరుగా ఉండేదనే అభిప్రాయం చాలామంది తెలుగు ప్రేక్షకుల్లో కలిగింది. ప్రభాస్ కటౌట్, అతడికున్న ఇమేజ్‌కు అలాంటి హీరో ఎలివేషన్లు ఉంటే మాస్ ప్రేక్షకులకు పూనకాలొచ్చేసేవే.
కేజీఎఫ్‌లో ప్రభాస్ నటించకపోయినా.. ఈ సినిమాతో గొప్ప పేరు సంపాదించిన ప్రశాంత్ నీల్‌తో తర్వాతైనా జట్టు కడితే కాంబినేషన్ అదిరిపోతుందని, ఇద్దరూ కలిసి మాంచి మాస్, యాక్షన్ సినిమా చేస్తే బాక్సాఫీస్ షేకైపోతుందని అనుకున్నారు జనాలు. ఐతే ప్రభాస్‌కు అనేక కమిట్మెంట్లు ఉండగా.. ఓ కన్నడ దర్శకుడు వచ్చి అతడికి కథ చెబుతాడని, అది అతడికి నచ్చుతుందని.. ఇప్పుడిప్పుడే ఈ కాంబినేషన్ కార్యరూపం దాలుస్తుందని ఎవరూ అనుకోలేదు.
మధ్యలో ప్రభాస్-ప్రశాంత్ కాంబో గురించి వార్తలొచ్చినా నమ్మశక్యంగా అనిపించలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆ కలయికలో సినిమా ఓకే అయిపోయింది. ఇంకో నెల రోజుల్లో వీరి సినిమా సెట్స్ మీదికి వెళ్లిపోతోంది. ఇది దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తోంది. ఈ కాంబోపై అంచనాలు మామూలుగా లేవు. మరి ప్రేక్షకులు కోరుకున్నట్లే ఇద్దరూ కలిసి ఓ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో అందరినీ అలరిస్తారేమో చూడాలి.