అల్లా ఆగ్రహమే ఇర్ఫాన్ మరణానికి కారణమట

బతికి ఉన్నపుడు ఓ వ్యక్తికి ఎలాంటి పేరున్నా చనిపోయినపుడు అందరూ మంచే మాట్లాడతారు. విమర్శలు చేయరు. పాత విషయాల్ని పట్టుకుని తిట్టిపోయరు. అలాంటిది ఇర్ఫాన్ ఖాన్ లాంటి దిగ్గజ నటుడు, గొప్ప మానవతా వాది చనిపోతే.. అతడి గురించి విమర్శలు చేయడం, తగిన శాస్తి జరిగిందని చంకలు గుద్దుకుంటున్న వాళ్లను.. తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు అంటూ ఓపెన్‌గా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టే వాళ్లను ఏమనాలి? ఇలాంటి కామెంట్లు చేస్తున్నది అల్లా టప్పా వాళ్లు కాదు. పేరున్న జర్నలిస్టులు.. ముస్లిం మత పెద్దలు.

దీనికి కారణం గతంలో ఇర్ఫాన్ చేసిన హేతువాద వ్యాఖ్యలే. గతంలో ఇర్ఫాన్ ఇస్లాం మత ఆచారాలపై కొన్ని విమర్శలు చేశాడు. మత మౌఢ్యాన్ని ఖండించాడు.

రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి.. గొర్రెల్ని చంపి తినడం అసాంఘికం అన్నాడు. జంతు వధను ఖండించాడు. అలాగే విషాదానికి ప్రతీక అయిన మొహర్రం పండుగ రోజు సంబరాలు చేసుకోవడాన్ని కూడా తప్పుబట్టాడు. ముస్లిం మత పెద్దలకు కోపం తెప్పించే ఇలాంటి కామెంట్లు మరికొన్ని చేశాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అతడికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. తన సినిమాల్ని బహిష్కరించాలని కూడా పిలుపునిచ్చారు.

ఆ సంగతలా వదిలేస్తే.. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఇర్ఫాన్ రెండు రోజుల కిందట తనువు చాలించాడు. ఈ విషాద సమయంలో అతడి గురించి ఓ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు దారుణం. రంజాన్‌ను, ముస్లింల మత విశ్వాసాల్ని కించపరిచాడని.. అందుకే అల్లా అతణ్ని శిక్షించాడని.. ఇర్ఫాన్‌కు తగిన శాస్తి జరిగిందని అన్నాడు. దీన్ని ఎండోర్స్ చేస్తూ మరిందరు ఛాందసవాదులు కామెంట్లు పెట్టడం గమనార్హం.