గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ – వీళ్ళకి అనుమతి లేదు!

ఎల్లుండి రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ కోసం మహేష్ బాబు, రాజమౌళి అభిమానులే కాదు మూవీ లవర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పటిదాకా ఈ ప్యాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ఎలాంటి కంటెంట్ వదలకుండా జాగ్రత్త పడిన జక్కన్న మొదటిసారి దీని ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న వేడుక ఇదే కాబట్టి, లైవ్ లో చూడాలని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య వేలల్లో కాదు లక్షల్లో ఉంది. ఓపెన్ గ్రౌండ్ ఈవెంట్ కనక ఎవరైనా వెళ్ళిపోవచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దర్శక ధీర రాజమౌళి ఒక వీడియో రూపంలో స్వయంగా వివరణ, సూచనలు ఇచ్చారు.

ఆ సారాంశం ఏంటో చూద్దాం. గ్లోబ్ ట్రాట్టర్ వేడుక అందరికీ కాదు. కేవలం పాసులు ఉన్న వాళ్ళను మాత్రమే అనుమతిస్తారు. 18 లోపు వయసున్న పిల్లలను, వృద్ధులను ప్రాంగణంలోకి తీసుకెళ్లరు. రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ ఆ రోజు మూసివేసి ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు ముందే లెఫ్ట్ టర్న్ తీసుకుని అనాస్ పూర్ కెళ్లే రోడ్డు నుంచి వెనుక ఉన్న డయాస్ వద్దకు చేరుకోవాలి. ఎల్బి నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11 దాటి ముందుకొచ్చి యుటర్న్ తీసుకుని సాంఘీ నగర్ మీదుగా అక్కడ ఏర్పాటు చేసిన బోర్టులను అనుసరిస్తూ చేరుకోవాలి. గచ్చిబౌలి బృందాలు ఎగ్జిట్ 12 నుంచి ఇదే ఫాలో కావాలి.

కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే నడుచుకోవాలి. పాసుల మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే అన్ని వివరాలు వీడియోతో సహా అందులో ఉంటాయి. షార్ట్ కట్స్ ని నమ్ముకోకూడదు. మధ్యాహ్నం 2 నుంచే ఎంట్రీ ఉంటుంది వీలైనంత త్వరగా చేరుకోవడం మంచిది. ముఖ్యంగా వెహికల్స్ ఉన్న వాళ్ళు పార్కింగ్ కోసమైనా ప్లానింగ్ తో ఉండటం అవసరం. కమీషనర్ సూచనల మేరకు రాజమౌళి టీమ్ పక్కా ప్రణాళికతో ఉంది. సో ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎవరైనా సరే ఎల్లుండి ఈవెంట్ కి వెళ్లే టైంలో ఇవన్నీ ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని పాసులు ఉంటేనే బయలుదేరాలి. లేదంటే హాట్ స్టార్ లో చూడాలి.