చున్నీ తీద్దాం… ఇది రైటేనా ఫ్రెండ్

ది గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ బృందం ఓ మల్టీప్లెక్సుకు వెళ్ళింది. షో అయ్యాక ఒక అమ్మాయి ఈ సినిమా తనకు ఎంత నచ్చిందో వివరించి, క్లైమాక్స్ అయ్యాక తనకు ఒకటి తీయాలనిపించిందని చెబుతూ చున్నీ తొలగించి అక్కడున్న వాళ్ళను ఆశ్చర్యపరిచింది. ఆనందంతో ఉబ్బితబిబ్బయిపోయిన డైరెక్టర్ వెంటనే ఆమె అడగకుండానే కౌగలించుకుని తన ఆనందం వ్యక్తం చేశాడు. ఈ వీడియో నిన్న బాగానే వైరల్ అయ్యింది. దీంతో ఇదేదో పబ్లిసిటీకి ఉపయోగపడేలా ఉందని భావించిన నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ తన ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో షేర్ చేసుకుని మరీ సంతోషం ప్రకటించింది.

ఇక్కడ ప్రశ్న ఏంటంటే విమెన్ ఎంపవర్ మెంట్ అంటే చున్నీ తొలగించడం ఎలా అవుతుందో అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ఆడవాళ్లకు అలాంటి ఆచ్చాదన పెట్టడానికి కారణమే ప్రకృతి పరంగా శరీరంలోని ఒక ముఖ్యమైన భాగానికి రక్షణ కలిగించడం. అంతే తప్ప ఎవరికో భయపడి కాదు. అంతెందుకు ఓ మహిళ బయటికి వచ్చాక కొందరు మగాళ్ల చూపులు ఎక్కడెక్కడ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రోగ్రెసివ్ థింకింగ్ అనేది ఆలోచనలో, పనుల్లో ఉండాలి తప్పించి ఇలా దుపట్టాలలో కాదనేది ఓపెన్ కామెంట్. సినిమాల్లో హీరోయిన్లు చేయడం వేరు నిజ జీవితంలో మనం ఆచరించడం వేరు.

అంతెందుకు వేరే థియేటర్ లో గర్ల్ ఫ్రెండ్ చూసేందుకు వెళ్లిన రష్మిక మందన్న సాధారణ దుస్తుల్లోనే ఉంది తప్పించి దుపట్టా లేకుండా వెళ్లి ఏదో సందేశం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. గర్ల్ ఫ్రెండ్ లో ఉద్దేశం అమ్మాయిలు స్వతంత్రంగా ఆలోచిస్తూ తప్పులను వెంటనే సరిదిద్దుకుని సరైన నిర్ణయాలు తీసుకోమని చెప్పడమే. అంతే తప్ప భౌతికంగా పాటించే వస్త్రధారణను, సంప్రదాయాలను పక్కన పెట్టమని కాదు. ఒకరకంగా చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ ని అమ్మాయిలు ఇలా ఇంకో కోణంలో అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదు. సరే తానదో ఎగ్జైట్ మెంట్ లో చేసేసింది కానీ దాన్ని కూడా ప్రచారానికి వాడుకోవడమే ట్విస్టు.