కీర్తి సురేష్… ఎన్నాళ్లకెన్నాళ్లకు

కీర్తి సురేష్‌ను తెలుగు ప్రేక్షకులు పరభాషా కథానాయికలా చూడరు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులపై అలాంటి ముద్ర వేసిందామె. కానీ తర్వాత ఆమె అంచనాలను అందుకోలేకపోయింది. ‘సర్కారు వారి పాట’ సహా పలు చిత్రాల్లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఐతే ఫలితాలు ఎలా ఉన్నా కీర్తిని వెండితెరపై చూడడం మన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. కానీ అనుకోకుండా ఆమెకు, తెలుగు ప్రేక్షకులకు కనెక్షన్ కట్ అయిపోయింది. తనను తెలుగు వెండితెరపై చూసి చాలా రోజులైపోయింది.

తెలుగులో ఆమె కథానాయికగా నటించి థియేటర్లలో రిలీజైన చివరి చిత్రం 2022లో వచ్చిన ‘సర్కారు వారి పాట’నే. తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో చెల్లెలి పాత్రలో కనిపించింది. ఈ ఏడాది ‘ఉప్పు కప్పురంబు’ సినిమాతో పలకరించినప్పటికీ.. అది ఓటీటీకి పరిమితమైంది. ఐతే మూడేళ్ల విరామం తర్వాత కీర్తి కథానాయికగా నటించిన ఓ తెలుగు చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. అదే.. రివాల్వర్ రీటా.

జేకే చంద్రు అనే తమిళ దర్శకుడు రూపొందించిన ‘రివాల్వర్ రీటా’ ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. ఇందులో రాధిక శరత్ కుమార్, ఓ కీలక పాత్ర చేసింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఇంతకుముందు కీర్తి అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది కానీ.. ఇందులో ఫుల్ యాక్షన్, హీరోయిజం ఉండబోతున్నాయి. ఎప్పుడో షూట్ పూర్తయినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం అయింది.

ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. కీర్తి దీని గురించి అధికారికంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది. పెద్దగా పోటీ లేని సమయంలో రిలీజవుతున్న ఈ చిత్రానికి మంచి టాక్ వస్తే కీర్తికి చాన్నాళ్ల తర్వాత ఓ విజయం దక్కొచ్చు. ఆమె తెలుగులో కొంచెం గ్యాప్ తర్వాత విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళం, మలయాళంలోనూ ఆమెకు కొన్ని సినిమాలున్నాయి.