సాహితీ వనంలో విప్లవ కుసుమం ‘అందెశ్రీ’

ప్రముఖ విప్లవ రచయిత అందెశ్రీ ఇవాళ కన్నుమూయడం సాహితీవేత్తలను, పరిశ్రమ వర్గాలను, ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉదయం గుండెపోటు రాగానే ఇంట్లో వాళ్ళు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సినిమాల పరంగా అందెశ్రీ చేసిన సేవలు, రాసిన సాహిత్యం చాలా గొప్పది. ముఖ్యంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కలయికలో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఎర్ర సముద్రంలో ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడు’ విపరీత ఆదరణకు నోచుకుంది. పలు ఏపీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు సబ్జెక్టులో ఈ పాటను ఒక పాఠంగా పెట్టడం అందెశ్రీ ఘనతకు సాక్ష్యం.

సింధు తులాని నటించిన బతుకమ్మలో సినుకమ్మా వాన సినుకమ్మా, రండి కదలి రండి పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఆ చిత్రానికి అందెశ్రీ మాటలు కూడా రాశారు. జగపతిబాబు జై బోలో తెలంగాణలో ‘జన జాతరలో మన గీతం’ క్లాసు మాస్ లేకుండా అందరినీ ఆకట్టుకున్న గీతంగా నిలిచింది. 2006లో విడుదలైన గంగ సినిమాకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. ఇక అందెశ్రీ జీవిత విశేషాలు చూస్తే సిద్ధిపేట జిల్లా రేబర్తి ఆయన స్వగ్రామం. 1961 జూలై 31 జన్మించారు. పాఠశాల చదువు పెద్దగా లేకపోయినా కవిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

దాశరథి సాహితి పురస్కారం (2015), జానకమ్మ జాతీయ అవార్డు (2022), దాశరధి కృష్ణమాచార్య సాహితి పురస్కారం (2024) తో పాటు ఎన్నో అవార్డులు ఆయన కీర్తి కిరీటంలో చేరాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మక రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ రాసే భాగ్యాన్ని అందెశ్రీనే అందుకున్నారు. అందుకే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. రచనలు మొదలుపెట్టాక కలం పేరే అసలు పేరుగా మారిపోయింది. సాహితిలోకాన్ని శోకంల్లో ముంచుతూ అందెశ్రీ సెలవు తీసుకున్నా ఆయన సాహిత్యం చిరకాలం జీవించే ఉంటుంది.