కాంతకు అదొక్కటే చింత

వచ్చే వారం విడుదలవుతున్న సినిమాల్లో దుల్కర్ సల్మాన్ కాంత మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. దగ్గుబాటి రానా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడమే కాదు కీలక పాత్ర పోషించడంతో హైప్ పరంగా ప్లస్ అవుతోంది. ఇటీవలే ట్రైలర్ రూపంలో కంటెంట్ ఎలా ఉండబోతోందో చూపించేశారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ డ్రామాలో సముతిరఖని హీరో తర్వాత అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ కాంతకో చింత ఉంది. అదేంటంటే ఈ మూవీ బ్యాక్ డ్రాప్ పూర్తిగా చాలా తక్కువ చిత్రాల్లో నటించిన ఒక లెజండరీ తమిళ నటుడికి సంబందించినదట.

జీవితాన్ని ఇచ్చిన గురువుతోనే ఈగోకి వెళ్లి కెరీర్ ని మార్చుకున్న ఒక యాక్టర్ జీవితాన్ని కాంతలో చూపించబోతున్నారు. ఇందులో నిజాలు ఉంటాయి, క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. కాకపోతే మన ఆడియన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందనేది కీలకం. ఎందుకంటే దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఎక్కువ తమిళ్ ఫ్లేవర్ లోనే తీసిన వైనం స్పష్టం. మన నేటివిటీ ఎంత వరకు అనిపిస్తుందనేది స్క్రీన్ మీద చూస్తే కానీ క్లారిటీ రాదు. మహానటిని మనం అంతగా ఎగబడి చూడ్డానికి కారణం సావిత్రి తెలియని తెలుగు ఇల్లు లేకపోవడమే. కానీ కాంతలో అలాంటి ఛాన్స్ లేదు. ఇది ఫలానా వారి బయోపిక్ అని టీమ్ ఎక్కడా చెప్పలేదు.

పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కాంతకు పండగే. ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద పెద్దగా సౌండ్ లేదు. ది గర్ల్ ఫ్రెండ్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలు మంచి టాక్ తో డీసెంట్ వసూళ్లు రాబడుతున్నాయి కానీ మరీ అద్భుతాలు చేయడం లేదు. ఒకవేళ ఆదివారం అనూహ్యంగా రెట్టింపు పికప్ చూపిస్తే కనక సూపర్ హిట్ స్టాంప్ వేసేయొచ్చు. ఇంకో రెండు మూడు రోజులు ఆగితే కానీ కమర్షియల్ రిజల్ట్ ఏంటనేది బయట పడదు. కాంతకు పోటీగా సంతాన ప్రాప్తిరస్తు ఉంది. శివ రీ రిలీజ్ హడావుడి ఎక్కువగానే జరిగేలా ఉంది. మరి కాంత ఈ చింతలన్నీ తట్టుకుని విజేతగా నిలవాలంటే ఎక్స్ ట్రాడినరి టాక్ రావాల్సిందే.