దేశంలో తెలుగు రాష్ట్రాలను మించిన సినీ అభిమానం ఇంకెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి ఇతర భాషల వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఒక యూనిట్‌గా తీసుకుంటే.. ఇక్కడున్నన్ని థియేటర్లు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు. కానీ ఇలాంటి చోట ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దాని కోసం మన సినీ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు.
ఐతే ఈ మధ్య ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. హైదరాబాద్‌లో భారీ ఐమాక్స్ స్క్రీన్ రాబోతున్నట్లు చెప్పారు. ఆ మాటతో తెలుగు సినీ ప్రియుల్లో అమితానందం వ్యక్తమైంది. కానీ అంతలోనే ఐమాక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రీతమ్ డేనియల్ ఆ ప్రచారాన్ని ఖండించాడు. ఈ వార్తలు నిజం కాదని ఆయన తేల్చేశాడు.
తర్వాత ఏషియన్ వాళ్ల నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. బహుశా ఐమాక్స్ స్క్రీన్ కోసం సంప్రదింపులు జరుగుతుండొచ్చు. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారులే అనుకున్నారంతా. కానీ సునీల్ నారంగ్ తనయురాలు, యువ నిర్మాత జాన్వి నారంగ్ కూడా ఐమాక్స్ స్క్రీన్ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోయారు. తాను ఈ విషయంలో ఏ కామెంట్స్ చేయనని ఆమె మీడియా ఇంటర్వ్యూలో అన్నారు.
హైదరాబాద్‌కు ఐమాక్స్ స్క్రీన్ వచ్చే అవకాశం ఉన్నట్లు మాత్రమే తన తండ్రి చెప్పారని.. అంతకుమించి చెప్పడానికేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఐమాక్స్ ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో తనకు కూడా క్లారిటీ లేదని జాన్వి అన్నారు. ఇక తమ ఆధ్వర్యంలో నడిచే మల్టీప్లెక్సుల్లో టాప్ అనదగ్గర ఏఎంబీ సినిమాస్ గురించి ఆమె ఒక ఆసక్తికర విషయం చెప్పారు. ఇక్కడ స్నానాల గదులు కూడా ఉంటాయని.. పని చేసుకుని అలసిపోయి వచ్చిన వాళ్లు.. అలాగే ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చూసేవాళ్లు.. షవర్ చేసుకుని ఫ్రెష్ అయి రావచ్చని ఆమె తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates