భీమ్స్ భాయ్… గురి తప్పుతోంది చూడూ

గత ఏడాది వరకు కేవలం మ్యూజిక్ లవర్స్ కు మాత్రమే ఎక్కువ పరిచయమున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం దెబ్బకు అందరికీ రీచ్ అయిపోయాడు. ముఖ్యంగా గోదారి గట్టు మీద రామసిలకావే పాట కొన్ని లక్షల రీల్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ ఆల్బమే ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి పని చేసే అవకాశాన్ని తెచ్చిందంటే అతిశయోక్తి కాదు. అనిల్ రావిపూడి రికమండేషన్ ఉన్నప్పటికీ చిరుకి వ్యక్తిగతంగా భీమ్స్ పనితనం నచ్చడం వల్లే టీమ్ లోకి వచ్చాడనేది నిజం. దానికి తగ్గట్టే మీసాల పిల్ల ఓ రేంజ్ లో చార్ట్ బస్టరై నమ్మకాన్ని నిలబెట్టింది.

ఇప్పుడు సమస్య వేరొకటి ఉంది. ఇటీవలే విడుదలైన మాస్ జాతరలో భీమ్స్ వర్క్ మీద నెగటివ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఎంత మాస్ కోసమే అయినా మరీ హోరెత్తిపోయే సౌండ్ తో చెవులు బాదేలా వాయించిన తీరుకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సైతం సౌండ్ ఎక్కువై, ఫీల్ తగ్గిపోయి ఏదేదో అయ్యింది. కంటెంట్ బాలేదన్నది తర్వాతి సంగతి. కనీసం భీమ్స్ తన వరకు బెస్ట్ సాంగ్స్ ఇవ్వలేదనేది ఫ్యాన్స్ కంప్లయింట్. ధమాకా అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మొదటి కారణం భీమ్స్ పాటలే. కానీ అదే కలయికతో మేజిక్ చేయడంలో భీమ్స్ దారుణంగా ఫెయిలయ్యాడు.

మంచి అవుట్ ఫుట్ రాబట్టుకోవడంలో భాను భోగవరపు విఫలమయ్యాడా లేక భీమ్స్ తన స్వంత టేస్ట్ తో మాస్ జాతరకు సాంగ్స్  ఇచ్చాడా అనేది పక్కనపెడితే మన శంకరవరప్రసాద్ గారుకి కొంచెం ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. రవితేజ – కిషోర్ తిరుమల సినిమా కూడా తన చేతిలోనే ఉంది. మాస్ జాతర తెచ్చిన మచ్చని పోగొట్టుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. క్లాసు మాసు రెండింటిని మంచి మ్యూజిక్ ఇవ్వగలిగిన బీమ్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే వరస హిట్లతో తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వాళ్ళతో పోటీ పడొచ్చు. లేదంటే అనూప్ రూబెన్స్ తరహాలో కెరీర్ ఎక్కువ కాలం పీక్స్ లో ఉండకుండా పోయే ప్రమాదముంది.