అభిజీత్‍ని బిగ్‍బాస్‍ అందుకే టార్గెట్‍ చేసాడా?

ఈ సీజన్‍ విజేతగా అభిజీత్‍ నిలుస్తాడని గత కొన్ని వారాలుగా అర్థమవుతూనే వుంది. హౌస్‍లో వున్న మిగిలిన సభ్యులతో పోలిస్తే సెన్సిబుల్‍గా వ్యవహరిస్తూ, తెలివిగా మాట్లాడే అభిజీత్‍ ఫిజికల్‍ టాస్కుల్లో వీక్‍ అయినా కానీ మంచి మాటకారి. ఈ లక్షణాలు అతడికి ఫాలోయింగ్‍ పెంచాయి. అయితే సీజన్‍ మొదలైనప్పట్నుంచీ అభిజీత్‍కి ఓట్లు ధారాళంగా వచ్చేవి. సీజన్‍ మొదట్లో పదే పదే నామినేట్‍ అవడానికి అభిజీత్‍ కూడా అమితాసక్తి చూపించేవాడు. ఒక టైమ్‍లో తాను నామినేట్‍ అయితే స్క్వాడ్‍ చూసుకుంటుందంటూ నోరు జారాడు. దాంతో ఏజెన్సీని హైర్‍ చేసుకుని వెళ్లాడనేది స్పష్టమయింది.

బిగ్‍బాస్‍ ఆడడానికి వెళ్లే వారిలో పలువురు ఇలా ఏజెన్సీల సాయం తీసుకోవడం సహజం. అయితే ఇది అర్హుల అవకాశాలను దెబ్బ తీస్తోందనే విమర్శలొస్తున్నాయి. మున్ముందు ఇలా ఏజెన్సీల సాయంతో వచ్చేవాళ్లు ఎక్కువైపోతారనే విశ్లేషణలు కూడా చాలానే వచ్చాయి. అందుకే అభిజీత్‍ని టార్గెట్‍ చేస్తూ అతడిని వీలయినంత కిందకు లాగాలనే ప్రయత్నం బిగ్‍బాస్‍ క్రియేటివ్‍ ప్రొడ్యూసర్స్ చేస్తున్నట్టు అనిపిస్తోంది.

నాగార్జునతో అభిజీత్‍పై కేకలు వేయించి అతను మోకాళ్లపై పడి క్షమించమని వేడుకునేలా చేయడమే కాకుండా అతని బెస్ట్ ఫ్రెండ్‍ అయిన హారిక కూడా అతడిని నామినేట్‍ చేసేట్టు చేసారు. అయితే ఇప్పటికీ అభిజీత్‍కే విజయావకాశాలు అధికంగా వున్నాయి. సోహైల్‍కి, అఖిల్‍కి కూడా ఆదరణ వుంది కానీ వారిద్దరూ ఫైనల్‍ 5లో వున్నట్టయితే ఓట్లు చీలిపోయి అభిజీత్‍ విజయం లాంఛనమవుతుంది.