అల్లు అర్జున్ అంత మాట అనేశాడేంటి?

టాలీవుడ్‌కు గర్వకారణంగా నిలిచి.. తెలుగు సినిమా చరిత్రను గొప్ప మలుపు తిప్పిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలను కలిపి ఈ నెల 31న ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రీ రిలీజ్ చేస్తోంది చిత్ర బృందం. దీన్ని సెలబ్రేట్ చేయడానికి తెలుగు సినీ ప్రేమికులు గట్టిగానే సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమా వచ్చిన రెండు వారాలకే.. మరో కల్ట్ బ్లాక్ బస్టర్‌ రీ రిలీజ్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది. అదే.. శివ. 

1989లో విడుదలై తెలుగు సినిమా గమనాన్ని మార్చేసిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో 4కే లోకి కన్వర్ట్ చేసి అదిరిపోయే క్వాలిటీతో అందిస్తోంది. ‘బాహుబలి’ లాగే ఈ సినిమాను కూడా టాలీవుడ్ ప్రముఖులు ముందుండి ప్రమోట్ చేయబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు.

‘శివ’ రీ రిలీజ్ గురించి బన్నీ వీడియో బైట్ ఇవ్వడం విశేషం. తన వీడియోతోనే ‘శివ’ రీరీలీజ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది అన్నపూర్ణ స్టూడియోస్. శివ సినిమా తెలుగు సినిమా డైనమిక్స్‌ను ఎలా మార్చిందో చెబుతూ.. ఈ సినిమాను సెలబ్రేట్ చేయడానికి తెలుగు ప్రేక్షకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు బన్నీ. ఐతే ఈ సందర్భంగా అతను వాడిన ఒక పద ప్రయోగం విమర్శలకు దారి తీస్తోంది. ‘‘టు ఆల్ ద అక్కినేని ఫ్యాన్స్.. టీఎఫ్ఐ బానిసాస్’’ అని బన్నీ పేర్కొన్నాడీ వీడియోలో. తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

హద్దులు దాటే ఈ అభిమానం గురించి సెటైరిగ్గా కొందరు ‘టీఎఫ్ఐ బానిస’ అనే పద ప్రయోగం వాడుతుంటారు. సామాన్య నెటిజన్లు సరదాగానో, సెటైరిగ్గానో ఆ మాట అంటే ఓకే కానీ.. అల్లు అర్జున్ స్థాయి వ్యక్తి ఆ పద ప్రయోగం చేయడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బన్నీ సోషల్ మీడియా భాషతో ట్రెండీ అనిపించుకోవాలని భావించి ఉండొచ్చు కానీ.. ఆ మాట  తెలుగు సినీ ప్రేమికులను కించపరిచేలా ఉందనే చర్చ జరుగుతోంది.