ప్రభాస్ సినిమా అంటే ఏదీ ఆషామాషీగా ఉండదు. ‘బాహుబలి’ తర్వాత తన ఇమేజ్ మారిపోవడంతో అతను మామూలు సినిమాలు చేసే పరిస్థితి లేదు. కథలో భారీతనం ఉంటుంది. బడ్జెట్లు భారీగా ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నీయిన్లందరూ కూడా పెద్ద స్థాయి వాళ్లే ఉంటారు. విజువల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ‘రాధేశ్యామ్’ అనే ప్రేమకథ చేసినా.. దానికి అవసరం లేని భారీతనాన్ని జోడించారు. కానీ అది వర్కవుట్ కాలేదు.
ఐతే ప్రేమకథల స్పెషలిస్టుగా పేరుపొందిన హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవడంతో మళ్లీ తన నుంచి ఒక ప్రేమకథను చూడబోతున్నామనే అంచనా కలిగింది. ఈ సినిమా నుంచి లీక్ అయిన ప్రభాస్ లుక్స్, ఆన్ లొకేషన్ పిక్స్ చూస్తే ఇది సాఫ్ట్ మూవీయే అనిపించింది. చాలామంది దీన్ని ఒక ప్రేమకథ అనే భావిస్తున్నారు. కానీ దీపావళి కానుకగా రిలీజ్ చేసిన ప్రి లుక్ పోస్టర్ చూస్తే వ్యవహారం వేరుగా కనిపిస్తోంది.
హీరోను బ్యాక్ లుక్‌లో చూపిస్తూ.. పదుల సంఖ్యలో గన్నులు పేలుతున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఒంటరిగా నిలబడే ఒక బెటాలియన్.. అంటూ దీనికి క్యాప్షన్ పెట్టారు. దీపావళి పండుగను సూచిస్తూ పోస్టర్‌ను ఇలా డిజైన్ చేసినట్లు కనిపిస్తున్నా.. సినిమా జానర్‌ను కూడా ఇది ఉద్దేశించినట్లే ఉంది.
హను అంటే క్లాస్ డైరెక్టర్ అనే పేరే ఉంది. తన కెరీర్లో ఎక్కువగా తీసినవి ప్రేమకథలే. పైగా చివరగా అతను తీసింది ‘సీతారామం’ అనే క్లాసిక్ లవ్ స్టోరీ. దీంతో ప్రభాస్ సినిమా కూడా ప్రధానంగా ప్రేమకథే అయి ఉంటుందనే అంచనాలు కలిగాయి. కానీ ఇందులో యాక్షన్ డోస్, హీరోయిజం కూడా గట్టిగానే సంకేతాలను ప్రి లుక్ పోస్టర్ ఇచ్చింది. గురువారం ప్రభాస్ పుట్టిన రోజు. ముందు రోజు ఈ సినిమా నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. అది చూస్తే సినిమా ఎలా ఉండబోతోందనే ఫుల్ క్లారిటీ వచ్చేయొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates